
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ డిపోకు మేనేజర్ లేక ప్రయాణికులు ఆర్టీసీ ఉద్యోగులు సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ఇంతకుముందు డిపో మేనేజర్ గా పనిచేసిన సురేష్ అదే సంస్థకు చెందిన ఉద్యోగి వద్ద లంచం తీసుకుంటూ మూడు నెలల క్రితం రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ ట్రాప్ అయ్యారు. దీంతో అప్పటినుండి పూర్తిస్థాయి ట్రిప్పు మేనేజర్ లేక హుస్నాబాద్ డిపో మేనేజర్ కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన చుట్టపు చూపుగా హుజురాబాద్ కు వచ్చి వెళ్తుండడంతో డిపోలో నెలకొన్న సమస్యలతో పాటు డిపో పరిధిలోని బస్టాండ్ లో నెలకొన్న సమస్యలు ప్రయాణికుల ఇక్కట్ల గురించి దృష్టి పెట్టలేకపోతున్నారు. హుజురాబాద్ డిపో పరిధిలో వారు 60కి పైగా వాసులు ఉన్నప్పటికీ సగానికి పైగా స్క్రాప్ గా మారాయి. సుదూర ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ బస్ లు సరిపడా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో రిపేరుకు వచ్చిన బస్సులతో సైతం కాలం వెళ్లదీస్తున్నారు. పూర్తిస్థాయి డిపో మేనేజర్ ఉంటే నిత్యం డిపోను పర్యవేక్షించడమే గాక బస్టాండ్ల పరిస్థితిని ప్రయాణికుల అవసరాలను గుర్తించి రూట్ వారిగా బస్సులను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ కింది స్థాయి ఉద్యోగులు సరైన నిర్ణయాలు తీసుకోలేక నామమాత్రపు ట్రిప్పులతో అరకోర ఆదాయంతో డిపోను కొనసాగిస్తున్నారు. అయితే జమ్మికుంటలో నుండి నిత్యం హైదరాబాదుకు వందలాదిమంది రోడ్డు ప్రయాణం చేస్తుంటారు.
జమ్మికుంట నుండి హైదరాబాద్ వరకు నడుస్తున్న ట్రైన్స్ కూడా ఈ మధ్యకాలంలో పలు మార్లు రద్దు చేయబడ్డాయి. దీంతో జమ్మికుంట నుండి నిత్యం హైదరాబాద్ కు వెళ్తున్న పిల్లల కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ కు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో జమ్మికుంట నుండి ఉదయం 5 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ కు ఎక్స్ ప్రెస్ బస్సులు ఉండేవి. వాటిని ఇప్పుడు రద్దు చేశారు. హుజురాబాద్ నుండి మాత్రమే హైదరాబాద్ కు ఒకటి రెండు బస్సులు మాత్రమే నడుపుతున్నారు. దీంతో జమ్మికుంట నుండి ప్రయాణం చేయాల్సినప్పుడు అనేకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులతోపాటు ప్రయాణికులు కూడా హైదరాబాద్ బస్సులు నడపాలని కోరారు. మంత్రి పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు.
కానీ డిపో మేనేజర్ లేకపోవడంతో హైదరాబాదుకు నడిసె బస్సులు ఇంకా మొదలు కాలేదు. ఇంతకుముందు ప్రతి మండలంలోని సగానికి పైగా గ్రామాలకు బస్సు సౌకర్యం ఉండేది, ఇప్పుడు సగానికి తక్కువగా కూడా వెళ్లడం లేదు. హుజురాబాద్ నుండి గతంలో ఉన్న భీవండి బస్సులు రద్దు చేయడం, రోజు నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, కాకినాడ వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా రద్దు చేయడం జరిగింది. హుజురాబాద్ డిపోకు పూర్తిస్థాయి డిపో మేనేజర్ ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. హుజురాబాద్ నుండి జమ్మికుంటకు నడుస్తున్న మినీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు అయినప్పటినుండి కెపాసిటీకి మించి ఎక్కువమంది ప్రయాణం చేస్తున్నారు. మినీ బస్సులు గత కొన్ని సంవత్సరాల నుండి హుజురాబాద్, జమ్మికుంటకు, అప్పుడప్పుడు హనుమకొండ, కరీంనగర్ కు నడుస్తున్నాయి. అవి కూడా పూర్తిస్థాయిలో రిపేర్ కు వచ్చాయి. ఏదైనా ప్రమాదం జరుగుతే ఎవరు బాధ్యతలు తీసుకుంటారో అర్థం కావడం లేదు. నిత్యం ప్రతి మినీ బస్సులో 60 మంది ప్రయాణికులు ప్రయాణము చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి పొన్నం స్పందించి హుజురాబాద్ డిపోకు కొత్త బస్సులతోపాటు ప్రయాణికులకు సురక్షితమైన త్రాగునీరు, ఎల్లప్పుడు మరుగుదొడ్లు, మూత్రశాలలు అందుబాటులో ఉండేలా నిర్మాణలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తక్షణమే పూర్తిస్థాయి డిపో మేనేజర్ ను నియమించి డిపో పరిధిలోని సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని హుజురాబాద్ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు.









