
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సందర్భంగా రుణమాఫీ విషయంలో చెప్పింది ఒకటని, నేడు చేస్తుంది మరొకటని, రుణమాఫీ విషయంలో 6 పేజీల నియమ నిబంధనలు, కొర్రీలు పెట్టి రుణమాఫీ ఎవరికి చేశారో అర్థం కాని పరిస్థితి ఉందని, రైతు భరోసాను ఎగ్గొట్టి రుణమాఫీ పేరిట డ్రామాలు మొదలుపెట్టిందని, కాంగ్రెస్ సర్కార్ రైతాంగాన్ని వంచించి మోసం చేసిందని బిజెపి జిల్లా అధ్యక్షుడి గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం హుజురాబాద్ లో స్థానిక బిజెపి శ్రేణులతో ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులను గోస పెట్టిన ఏ ప్రభుత్వాలు కూడా మనగడ సాధించలేదని, రైతుల కష్టాలు పట్టని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వాళ్ల ఉసురు తగలడం ఖాయమన్నారు. ముఖ్యంగా
కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులైన తొక్కి అధికారంలోకి రావాలనుకుని, అడ్డగోలు హామీలు ఇవ్వడమే కాకుండా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోయి దగాపడ్డమనే భావన ఏర్పడిందన్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీ విషయంలో 34 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అన్ కండిషనల్ గా ఒకేసారి చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చి నిబంధనలను తెరపైకి తెచ్చారన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని, రక్తాన్ని చెమటగా మార్చి, రెక్కలు ముక్కలు చేసుకుని,ఆరుగాలం కష్టపడి ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టే రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. అప్పుల బాధ పోతదని ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ నిరాశను మిగిల్చిందని, రైతులకు రుణమాఫీ ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు ఒకసారి ప్రజలంతా గమనించాలన్నారు. ఆనాడు ఎందుకు రుణాలు కడుతున్నారు, కట్టకండి, కట్టిన వాళ్ళు ఉంటే వెంటనే బ్యాంకుకు వెళ్లి 2 లక్షల రూపాయల రుణం తీసుకోండి అని చెప్పిన రేవంత్ రెడ్డి నేడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. రేషన్ కార్డు పేరుతో సగం మందికి,
ఇన్కమ్ టాక్స్ పేరుతో 20%, రీ షెడ్యూల్ చేసుకున్న పేరుతో ఇంకొంత మందికి మొత్తంగా రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. ఏడు నెలలు గడవకముందే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. రైతులకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇస్తామని చేతులెత్తేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానంగా చూస్తున్నారని, ఆగమాగంగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ రాజకీయాలను చేస్తున్నారు తప్ప ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి
ఏమాత్రం నిజాయితీ ఉన్న చిత్తశుద్ధి ఉన్న అన్ కండిషన్ గా రుణమాఫీ చేయాలని, రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్ల ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింహరాజు, బింగి కరుణాకర్, పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, మండల అధ్యక్షులు రాముల కుమార్, జిల్లా నాయకులు, పట్టణ, మండల నాయకులు, వివిధ మోర్చా అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, భూత్ అద్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







