
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని అంశంలో గవర్నర్ రాధాకృష్ణన్ ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కలిసి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు. అనంతరం మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న నాయకులందరం గవర్నర్ ని కలవటం జరిగిందన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కుతున్నదో ఆయకు వివరించటం జరిగిందన్నారు. హామీలు అమలు చేయాలన్న విద్యార్థుల మీద నిర్భంధం, అణిచివేత, అరెస్ట్ లు, అక్రమ కేసులతో భయానక వాతావారణం పునరావృతం చేస్తున్నారని చెప్పామన్నారు. సిటి సెంట్రల్ లైబ్రరీలో లాఠీ ఛార్జ్, ఓయూ విద్యార్థులపై దాడి చేస్తూ ఉద్యమ నాటి అణిచి వేత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రయోగిస్తుందని ఆయన దృష్టికి తెచ్చామని తెలిపారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ కు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన ప్రకటనలు, హామీలను గవర్నర్ కి తెలిపామన్నారు. గ్రూప్ 1, 2, 3 కి సంబంధించి పోస్టులు పెంచుతామని…ఆ హామీ పట్టించుకోవటం లేదన్నది వివరించామన్నారు. గవర్నర్ చాలా సీరియస్ గా ఈ అంశాలపై స్పందించారనీ, హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని చెప్పారన్నారు. రెండో అంశం రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యాంగ హననం జరుగుతుందో కూడా గవర్నర్ కి చెప్పామన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకున్న సంగతి ఆయనకు తెలిపామన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామని… స్పీకర్ కి కూడా ఫిర్యాదు చేశామని ఆయనకు వివరించారు.
బీఆర్ఎస్ పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, నిరుద్యోగుల విషయంలో ఆయన చాలా సీరియస్ గా స్పందించిన తీరుకు అభినందనలు తెలిపారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలను కూడా గవర్నర్ కి వివరించామన్నారు. ఎమ్మెల్యేల హక్కులకు భంగం వాటిల్లవద్దని ఆయన అన్నారు. దీనిపై కూడా ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని లేఖ రాస్తా అని చెప్పారు. భవిష్యత్ లో విపక్షాలుగా ఎలాంటి ఇబ్బంది వచ్చిన తనను కలవాలని ఆయన కోరారు. తన పరిధిలో ఉన్న అంశాల్లో తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పారు. ఓ వైపు రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్లు రాహుల్ గాంధీ ఫోజులు కొడుతూ…మళ్లీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చామన్నారు. కాంగ్రెస్ చేస్తున్న రాజ్యాంగ విరుద్దమైన పనులకు సంబంధించి గవర్నర్ కి మాత్రమే కాదు, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ పార్టీగా అండగా ఉంటుందనీ, వారికి కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తుందన్నారు. ఇక మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలు అయ్యిందంటూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. అక్కడ జరిగిన చిన్న విషయంపై తప్పుడు ప్రచారం చేశారనీ మండిపడ్డారు.
కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి అయ్యాయనీ, ఇప్పుడు వరదలాగ నీళ్లు వస్తున్న మేడిగడ్డ తట్టుకోవటమంటే అదే కాళేశ్వరం గొప్పతనం అన్నారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తామని, ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని స్పష్టం చేశారు. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం వస్తుందని సీఎం అన్నారనీ ఇప్పుడు నాలుగు నెలలు వాయిదా వేశారనీ, 4 వందల కోట్లు వస్తున్నాయా? అందులో సీఎం వాటా ఎంత? అనే డిమాండ్ చేశారు. ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు.







