
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: గత మూడు రోజులుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో నియోజకవర్గంలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయనీ వాటిని వెంటనే పరిష్కరించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీణవంక మండలం మామిడాలపల్లి ఆమ్లెట్ గ్రామమైన గొల్లపల్లిలోని బ్రిడ్జ్ పూర్తిగా పాడైపోయిందని, దీంతో రాకపోకలు కూడా నిలిచిపోయాయని వెంటనే దాన్ని మరమ్మత్తులు చేయించాలని కోరారు. మాచనపెళ్లి గ్రామంలో ఊరుకుంట చెరువు తెగిపోయే ప్రమాదం ఉందని, చెరువు అవతల 1000 ఎకరాల భూమి ఉంటుందని వెంటనే మరమ్మత్తులు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే పెద్దపాపాయిపల్లి గ్రామంలోని ఎల్లమ్మ చెరువు, చెల్పూర్ చిన్న చెరువులు నిండి కట్ట పైనుండి నీరు ఎక్కువ పోతుందని కట్టతెగే ప్రమాదం ఉందని వెంటనే వీటన్నింటిని పనులు పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. హుజురాబాద్ లోని బూడిగజంగాల కాలనీతో పాటు నియోజకవర్గంలోని చాలా కాలనీ వాసుల ఇండ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే వర్షాకాలంలో ఏర్పడే సీజనల్ వ్యాధుల పట్ల కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన సిబ్బందితో అన్ని రకాల సదుపాయాలతో పాటు రోగాలకు సరిపడే మందులు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఇరుమల్ల సురేందర్ రెడ్డి తదితరులున్నారు.






