
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయున్ని నియమించాలని డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ హుజురాబాద్ మరియు జమ్మికుంట జోన్ల సమావేశం హుజురాబాద్ లోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి మాట్లాడుతూ గత నెలలో ఇచ్చిన ప్రమోషన్లలో ఎస్.జీటీ టీచర్లకు తీవ్ర నష్టం జరిగిందని, ఇప్పటికైనా ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్ట్ కేటాయిస్తూ ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే గత నెలలో ట్రాన్స్ ఫర్ ఐన టీచర్లను వెంటనే రిలీవ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఎమ్. రఘుశంకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తక్కువ నిధులు కేటాయించడం తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు. మరొక అతిథి రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మూడవ తరగతి వరకు అంగన్వాడీలలో కలుపాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని దీనివల్ల ప్రాథమిక విద్య నిర్వీర్యం అవుతుందని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల తిరుపతి మాట్లాడుతూ లెఫ్ట్ ఓవర్ ప్రమోషన్లు పారదర్శకంగా జరపాలని ఏం ఒక్క ఉపాధ్యాయునికి నష్టం జరిగినా తీవ్ర ఉద్యమం చేస్తామని అన్నారు. జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు స్కావెంజర్లను నియమించాలని, అన్ని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు పూరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏబూసి శ్రీనివాస్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు సారాల సంపత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానందం, రత్నంలతో పాటు హుజురాబాద్, శంకరపట్నం, సైదాపూర్ , జమ్మికుంట,ఇల్లందకుంట, వీణవంక అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు చక్రధర్, బి శ్రీనివాస్, రమేష్, వెంకటస్వామి, సదానందం, ఎ శ్రీనివాస్, వేణు లతో పాటు ఆరు మండలాల సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.






