
–ఇచ్చిన మాటను నెరవేర్చేది* *కాంగ్రెస్ సర్కారే..
–ఆరు నూరైనా హామీలన్నీ అమలు చేస్తుంది..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ సర్కారు మాటమీద నిలబడు తుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ సర్కారు నెరవేరుస్తుందని తెలిపారు. మంగళవారం లక్షన్నరలోపు ఉన్న రైతుల రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.
ఈ మేరకు రైతుల ఖాతాల్లో లక్షన్నర రుణమాఫీ డబ్బులు ప్రభుత్వం జమ చేయనున్నదని వెల్లడించారు. ఈనెల 18న లక్ష వరకు ఉన్న రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసిందని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 36023 రైతుల ఖాతాల్లో లక్ష వరకు రుణమాఫీ కోసం 186.39 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని చెప్పారు. రెండో విడతలో భాగంగా మంగళవారం లక్షన్నర వరకు రుణమాఫీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నదని, లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణమాఫీని ఈనెల 31వ తేదీ వరకు చేయనుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది రైతుల ఖాతాల్లో సర్కారు నగదు జమ చేయనున్నదని వెల్లడించారు.
వరంగల్లో రాహుల్ గాంధీ రైతు డెకరేషన్లో ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈనెల 18న మొదటి విడత లక్ష వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టిందని, 31 వరకు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేయనుందని తెలిపారు. ఆగస్టులో రెండు లక్షల వరకు సర్కార్ రైతుల రుణమాఫీ చేయనుందని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగిసిన తర్వాత రెండు లక్షల వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నదని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ పాలకుల వల్ల ఆర్థిక పరిస్థితి అద్వానంగా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో హామీల అమలుకు వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. రైతులను రాజులుగా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని గ్రామాల్లో ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వారికి నూక లు చెల్లాయని విమర్శించారు. పదేండ్లు పాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు తమ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇది చూసి ఓర్వ లేక ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు.
ప్రతిపక్షాలు ఎంత గీపెట్టి అరిచినా తమ ప్రభుత్వం రైతుల, పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని వెలిచాల రాజేందర్ రావు స్పష్టం చేశారు. రైతులు రుణమాఫీ అయిన తర్వాత బ్యాంకులకు వెళ్లి కొత్తగా పంట రుణాలు పొందాలని ఆయన సూచించారు. ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. ఇదే ఆలోచనతో ప్రభుత్వం కూడా ముందుకు వెళుతున్నదని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.






