
–అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు హర్షం.
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు (యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ – పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్షిప్ బిల్ 2024)ను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. ఈ మేరకు శాసనసభలో పరిశ్రమల, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారని తెలిపారు.
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగావకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలున్న రంగాలకు సంబంధించి వివిధ కోర్సులను ఈ యూనివర్సిటీలో అమలు చేస్తుందని చెప్పారు. ఏటా 20 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దనున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా పాలన సాగిస్తున్నదని చెప్పారు. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగులతో చెలగాటమాడారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం నిరుద్యోగ సమస్య నిర్మూలన లక్ష్యంగా ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని వెలిచాల రాజేందర్ రావు తెలిపారు.






