
-అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి గార్డెన్ కు, చుట్టుపక్కల రైతులకు దారి చూపెట్టాలి..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ లోని వరంగల్ రోడ్ హెచ్ పీ పెట్రోల్ పంపు ఎదురుగా గల పాండ్రాల్ల నాగరాజు సర్వేనెంబర్ 2420 లోగల వ్యవసాయ భూమిని కబ్జా చేసామని ఆరోపించడంలో వాస్తవం లేదని బిఎస్ఆర్ గార్డెన్ యాజమాన్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ సర్వే నెంబర్ లో పాండురాల్ల నాగరాజు కుటుంబ సభ్యులకు 1959- 60 నుండి నేటి వరకు 21 గుంటల భూమి ఉండగా మూడు గుంటల భూమిని పోటు కరాబ్ కింద ప్రభుత్వం తొలగించిందని వారు తెలిపారు. గత కొన్నేళ్ల క్రితమే బిఎస్సార్ గార్డెన్ కు, చుట్టుప్రక్కల పొలాలకు వెళ్లే రైతులకు 30 ఫీట్ల రోడ్డును ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. హుజురాబాద్ గ్రామ పంచాయతీగా ఉన్న సందర్భంలో బిఎస్ఆర్ గార్డెన్ ఏర్పాటు చేసే క్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 30 ఫీట్ల రోడ్డు తీసి దారిని కేటాయించడం జరిగిందన్నారు. ప్రధాన రహదారి నుండి గార్డెన్ మీదుగా బతుకమ్మ సౌల్లకు వెల్లెందుకు 30 ఫీట్ల వెడల్పుతో ప్రభుత్వమే రహదారి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాగా గత 15 రోజుల క్రితం హుజురాబాద్ ఆర్డిఓ, ఎంఆర్ఓలతో సర్వే జరిపించగా నాగరాజుకు కేవలం పావు గుంట స్థలము(0.001/4(30 గజాలు) మాత్రమే రహదారికి పోయినట్టుగా రెవెన్యూ అధికారులు గుర్తించి దగ్గరుండి హద్దులు చూపించగా, నాగరాజు మాత్రం ప్రధాన రహదారి నుండి బిఎస్ ఆర్ గార్డెన్ వరకు పొడుగుతా సుమారు మూడు గుంటల స్థలాన్ని కందకం కొట్టి రహదారి లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వారు పేర్కొన్నారు. నాగరాజుకు సంబంధించిన భూమిలో కాకుండా రోడ్డు(దారి)ను సైతం తవ్వి నాటు వేయడంతో రాకపోకలకు, మనుషులు నడవడానికి ఇబ్బందిగా మారిందన్నారు. శుక్రవారం హైకోర్టు రిట్ పిటీషన్ నెం. 21372/ 2024 ద్వారా ఇచ్చిన ఆర్డర్ ప్రకారం గతంలో మాదిరిగా రహదారిని యధావిధిగా ఉంచాలని, ఫంక్షన్ హాల్ కు వచ్చే వాహనాలను అడ్డుకోరాదని ఆర్డర్ ఇవ్వడంతో యధా విధిగా ఆ రోడ్డును వాడుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. బిఎస్ఆర్ గార్డెన్ ను అన్ని రకాల అనుమతులతోనే ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం జరిగిందని, రోడ్డు కోసం కేటాయించిన భూమిని అక్రమంగా తమకు విక్రయించాలని నాగరాజు చూడడంతో తాము ఆ భూమిని తీసుకోమని తెగేసి చెప్పడంతో నాగరాజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు వారు తెలిపారు. శనివారం హుజురాబాద్ పోలీస్ లు, సంబంధిత అధికారులు సందర్శించి పరిశీలించి తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు, కోర్టు ఆదేశాలను చూపించగా సంతృప్తి చెంది వెళ్లారని తెలిపారు. బాధితుడు నాగరాజు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా మేము ఎలాంటి రోడ్డు కబ్జాకు పాల్పడలేదన్నారు. ఒకవేళ కబ్జాకు పాల్పడితే ప్రభుత్వం తీసుకొనే ఎలాంటి చర్యలకేనా సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ స్థలాన్ని తన స్థలంగా చూపి విక్రయించాలని చూస్తున్న నాగరాజు పై అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేగాక కోర్టు ఆదేశాలను ధిక్కరించి మళ్ళీ రోడ్డును చెడగొట్టిన నాగరాజు, అతనికి సంబంధించిన వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొని బిఎస్ ఆర్ గార్డెన్ కు, సమీప రైతులకు, గీత కార్మికులకు, కింది వాడకు వెళ్లే ప్రజలకు ప్రధాన రహదారి నుండి గతంలో మాదిరిగా దారి ఏర్పాటు చేయాలని బిఎస్ ఆర్ గార్డెన్ యాజమాన్యం విజ్ఞప్తి చేశారు.








