మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫో ర్స్ జీనియస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పండుగల సంస్కృతిని ప్రతిబింబిస్తూ, కృష్ణాష్టమి ముందస్తు వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. చిన్న పిల్లందరూ బాల కృష్ణుడు, గోపికల వేష ధారణతో తమ ముద్దు ముద్దు మాటలతో చూపరులను ఆకర్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో, ఆటపాటలతో అలరించారు. శ్రీకృష్ణుని దశావతారాల ప్రదర్శన కన్నులకు కట్టినట్లు చూపించారు. రాధాకృష్ణులుగా చిన్నారులు సందడి చేశారు. భగవద్గీతా పఠనం చేయించారు. పండుగ సంప్రదాయంలో భాగంగా కోలాటం ఆడి ఉత్సాహ భరితంగా ఉట్టికొట్టే కార్యక్రమం చేపట్టారు. చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలు, పండుగ విశిష్టతల గురించి తెలియచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని పునరుద్ధరించటానికి నన్ను నేను సృష్టించుకుంటానని శ్రీకృష్ణుడు అర్జునిడికి తెలిపాడని అన్నారు. భారత యుద్ధంలో పాండవుల పక్షాన ఉండి
ధర్మాన్ని గెలిపించి అధర్మంగా వ్యవహరించిన కౌరవుల ఓటమికి కీలకపాత్ర వహించాడని తెలిపారు. భూలోకంలో ధర్మం గతి తప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు
అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. శ్రీకృష్ణాష్టమి పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.