బిసి హక్కుల కోసం బిసి న్యాయవాదులు ముందుండాలి.. -హుజూరాబాద్ బార్ లో వాల్ పోస్టర్ ల ఆవిష్కరణ

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: బిసి హక్కుల సాధన కోసం చట్టం, న్యాయం, రాజ్యాంగం తెలిసిన బిసి న్యాయవాదులు ముందుండాలని ఐఎల్ పిఎ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్ అన్నారు. బిసి హక్కుల సాధన ఉద్యమంలో బిసి న్యాయవాదులను భాగస్వాములను చేయడం కోసం ఈ నెల 25న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి బిసి న్యాయవాదుల సదస్సును పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బార్ అసోసియేషన్ లో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బండి రమేష్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా 60 శాతంకు పైగా జనాభా కలిగిన బిసి ప్రజలను ఇంకా మనుషులుగా గుర్తించడం లేదని, జనగణన కోసం 70 ఏండ్లుగా ఎన్ని పోరాటాలు చేసినా నేటికీ బిసి జనాభా లెక్కలు చేయడం లేదని, జనాభా లెక్కలు చేయకుండా బిసి లకు రిజర్వేషన్లు పెంచి కోర్టులల్లో వీగిపోయేలా చేస్తున్నారని అన్నారు. జనగణన కోసం, చట్టసభల్లో బిసి వాటా కోసం కోసం దేశవ్యాప్త ఉద్యమం అవసరమని, ఆ ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాల్సిన అవసరముందని అన్నారు. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో కుల జనగణన – ఒబిసిల అభివృద్ధి, జనాభా దామాషా ప్రకారం అవకాశాలు- సామాజిక న్యాయం, మహిళా కోటాలో బిసి మహిళా వాటా, బిసి ఓటర్ల బానిసత్వం -పాలక వర్గాల ధోరణి అనే నాలుగు అంశాలపై ప్రముఖులైన బిసి కమీషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, కర్ణాటక హై కోర్టు న్యాయవాది ఎస్ బాలన్, పూనే న్యాయవాది వాసంతి నల్వడా, ప్రొఫెసర్ సింహాద్రి, మధ్యప్రదేశ్ న్యాయవాది వినాయక్ ప్రసాద్, తెలంగాణ ప్రభుత్వ మాజీ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ యాదవ్, బి శంకర్, బార్ అసోసియేషన్ సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల జీవన్ గౌడ్ లాంటి వారు ఈ సదస్సులో బిసిల స్థితిగతులు, భవిషత్ ఉద్యమం పట్ల ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి లక్ష్మణమూర్తి, బండి రవీందర్, కేశబోయిన అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!