Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చినట్లే ఆర్టీసికి కూడా ఇచ్చి నేటి వరకు వాటి అమలు చేయలేదని నిరసిస్తూ మంగళవారం హుజురాబాద్ ఆర్టిసి ఉద్యోగులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి డిపో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ..
ఆర్టీసి కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేస్తానని, రెండు పీఆర్సీలు బకాయిలతో సహా చెల్లిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అలాగే ఆర్టీసి బస్సులను ఆధునీకరించి, అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులు ప్రారంభిస్తామని, ఆర్టీసి యూనియన్లను పునరుద్ధరిస్తామని, వచ్చే ప్రభుత్వ పీఆర్సీ పరిధిలోకి టిఎస్ఆర్టీసి కార్మికులను చేరుస్తామని 6 గ్యారెంటీలు ఇచ్చిందని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 మాసాలైనా ఒక్క డిమాండ్ కూడా పరిష్కారానికి నోచుకోలేదని వాపోయారు. ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి 15-09-2023న గెజిట్ వెలువడినప్పటికీ ప్రభుత్వాలు మారినా ఈ సమస్యకు ఇంతవరకు మోక్షం లేదన్నారు. ట్రేడ్ యూనియన్లను పునరుద్దరిస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పిన నాయకులు నేడు మొహం చాటేసి తిరుగు తున్నారని పేర్కొన్నారు. ట్రేడ్ యూనియన్ల పునరుద్ధరణకు ప్రభుత్వానికైనా, యాజమాన్యానికైనా ఆవగింజంత ఖర్చు లేదని, అయినా పునరుద్ధరణకు వెనుకాడుతున్నాయని వారు తేలిపారు.
చనిపోయిన ఉద్యోగుల మరియు అనారోగ్య కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగి కుటుంబాల కిచ్చే ఉద్యోగాలు రెగ్యులర్ ప్రాతిపదికన జరగాలని ఇవి కారుణ్య నియామకాలు అన్నారు. ప్రభుత్వంలో ఇచ్చే ఉద్యోగాలు ఈ స్కీమ్‌లో రెగ్యులర్ ప్రాతిపదికనే ఇస్తున్నారని, 200 సంవత్సరాల క్రితం మనం పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాలు ఏ డిపోలోనైనా ఉన్నాయా? 12 గంటలు చేయాల్సిన స్పెషల్ ఆఫ్ డ్యూటీలు 14 నుండి 16 గంటలు చేయిస్తున్నారని ఆరోపించారు. అధిక పనిభారాలు మరియు వేధింపులు తట్టుకోలేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది తగ్గిపోవటం వలన ఒక రోజు లీవ్ దొరకడం కూడా గగనమైపోయిందని, వారి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒకరోజు లీవ్ కావాలని అడిగితే శవాలతో సెల్ఫీ దిగి ఫొటో పెట్టమంటోంది యాజమాన్యం అని ఇంతకన్నా పైశాచికత్వం మరోటి ఉందా? అని వారు ప్రశ్నించారు.
2017 వేతన సవరణ కేవలం 21 శాతం జరిగిందని, అలవెన్స్‌లు ఇప్పటిదాకా అమలు చేయలేదన్నారు. 2017 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు రిటైర్మెంట్నాడు చెల్లిస్తామని మేనేజిమెంట్ సర్క్యులర్ ఇవ్వడాన్ని జెఎసి తీవ్రంగా తప్పు పడుతోందన్నారు. ఆ బకాయిలను ఉద్యోగులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తోంది అన్నారు. 2021 వేతన సవరణ గడువు ముగిసి 3 సంవత్సరాలు పూర్తైనా నేటివరకు జరగనందున ఆర్టీసి ఉద్యోగులకు 25 శాతం ఇంటీరియమ్ రిలీఫ్ అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
గత పది సంవత్సరాలలో ఆర్టీసిని నిర్వీర్యం చేసి మొత్తంగా కుదించివేసే ప్రయత్నాలు జరిగాయని, హైదరాబాద్ నగరంలోని కొన్ని డిపోలతో పాటు ప్రింటింగ్ ప్రెస్‌ను పూర్తిగా మూసివేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్టీసి బస్సులను ఆధునీకరించి, అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు చెల్లిస్తామని చెప్పి 7 మాసాలు గడిచినా కేవలం డ్రైవర్లకు మాత్రమే చెల్లించి మిగిలిన ఉద్యోగులకు చెల్లించటానికి డబ్బులు లేవంటూనే లక్షలాది రూపాయల జీతంతో కన్సల్టెన్సీలను, రిటైర్ అయిన అధికారులను పెంచి పోషిస్తున్న యజమాన్య చర్యలు కార్మికులను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయన్నారు.
మహాలక్ష్మి పథకం : కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని, ఉద్యోగులుగా దాన్ని మేం స్వాగతిస్తున్నామన్నారు. ఎందుకంటే దానివల్ల అయ్యే ఖర్చు నెలకి 350 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, కాని ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల చెల్లింపులు జరగటం లేదన్నారు. ఈ పథకం అమలు జరిగినప్పటినుంచి డ్రైవర్ కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నప్పుడు జరిగిన క్యాష్ & టికెట్ ఇర్రెగ్యులారిటీలో అనేకమంది కండక్టర్లు, డ్రైవర్లు సస్పెండ్ అయి రిమూవల్ అవుతున్నారన్నారు. అలాగే నిత్యం బస్సులో ప్యాసింజర్లు సిబ్బందిపై దాడులు చేస్తూ, తిట్లు, చివాట్లు, రకరకాల గొడవలు చేస్తున్నా భరిస్తూ తమ విధులను నిర్వహిస్తూ ప్రభుత్వానికి, సంస్థకు పేరు తెస్తున్నప్పటికీ ప్యాసింజర్ల నుండి వచ్చిన చిన్న చిన్న ఫిర్యాదులపై సిబ్బందిని శిక్షించడాన్ని జెఎసి తీవ్రంగా ఖండిస్తోంది అని అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటంలో జరుగుతున్న జాప్యంతో పాటు ఆర్టీసి యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయటానికి అన్ని కార్మిక సంఘాలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని భావించి పలు సమావేశాలు నిర్వహించి కలిసొచ్చిన సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈనెల 17న ప్రభుత్వ, యాజమాన్యాలకు, లేబర్ కమిషనరు ప్రభుత్వ హామీలతో పాటు అన్ని కేటగిరీల పెండింగ్ సమస్యలతో కూడిన మెమోరాండంను ఇచ్చి ఉద్యమ కార్యా చరణను జెఎసి ప్రకటించిందని వారు తెలిపారు. 27న నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం జరిగిందన్నారు. 10-09-2024న ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ డిమాండ్స్ డే బ్యాడ్జెస్ పెట్టుకుని విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. 01-10-2024న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద పెద్ద యెత్తున సామూహిక నిరాహార దీక్ష నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ పోరాట కార్యక్రమాలన్నింటిలో యూనియన్లకతీతంగా ఆర్టీసి ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా హుజురాబాద్ జేసి నాయకులు టి ఎస్ సింగ్, ఎస్ కిషోర్, జి శ్రీనివాస్, మార్త రవీందర్ తదితరులు విజ్ఞప్తి చేశారు.






