
–ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న శ్రద్ధ రుణమాఫీలో ఎందుకు లేదు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీల ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు జిల్లా పోలీస్ అధికారుల ఫోన్లు కూడా ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. గురువారం జమ్మికుంటలోని మున్సిపల్ చైర్మన్ నాగేశ్వరరావు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే మాకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వానికి ఎలా చేరుతుందో చెప్పాలన్నారు. మేము ఎక్కడికి వెళ్లినా, ఏం మాట్లాడినా ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. నిన్న మానకొండూర్ శాసనసభ్యుడు హైదరాబాదులోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారని, ఆ ఇంటర్వ్యూలో కరీంనగర్ సిపి నుంచి మానకొండూరు సిఐ కి వీడియో కాన్ఫరెన్స్ రావడం లేదని ఎలా చెప్పారని ఆయన ప్రశ్నించారు. సిపి టెలి కాన్ఫరెన్స్ గోప్యంగా ఉంటుందని అయినప్పటికీ మానకొండూరు శాసన సభ్యుడికి ఆ విషయం తెలిసిందంటే కరీంనగర్ సిపి ఫోన్ కూడా ట్యాప్ చేశారని అర్థమవుతుందన్నారు. కరీంనగర్ లో ఉన్న అధికారుల అందరి ఫోన్లు చేస్తున్నట్టు ఇంటర్వ్యూలో శాసనసభ్యుడు చెప్పకనే చెప్పారన్నారు. కరీంనగర్ సిపి ఫోనే ట్యాప్ చేసినవారు మా ఫోన్ ట్యాప్ చేయడం లేదంటే ఎలా నమ్మమంటారని ఆయన ప్రశ్నించారు. మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానం ఉండేదని నిన్నటితో ఆ అనుమానం కూడా నిజమైందన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కూడా కరీంనగర్ జిల్లా సిపి ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ ఎంక్వయిరీ కి ఆదేశించాలని అన్నారు. బండి సంజయ్ కేంద్ర హోం మంత్రిగా దీనిపై పూర్తి విచారణ జరిపించడానికి తప్పక ముందుండాలని ఆయన కోరారు. అలాగే ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని, రైతులంతా రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల రుణమాఫీ మొత్తం కావాలంటే 49 వేల కోట్లు అవసరం ఉంటుందని బ్యాంకర్లు చెప్పినప్పటికీ వాటిని కటింగ్ చేసి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పూర్తి రుణమాఫీ చేయాలంటే 40,000 కోట్లు సరిపోతాయని చెప్పారన్నారు. తర్వాత మాట మార్చి 31,000 కోట్లు చెప్పి, బడ్జెట్లో 26 వేలు కోట్లు చూపించి చివరికి 17 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని, అవి కూడా పూర్తిస్థాయిలో చేశారో లేదో కూడా అర్థం కావడం లేదన్నారు. బ్యాంకర్లతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు 500 కోట్లు మాత్రమే రిలీజ్ చేసామని మంత్రి బట్టి విక్రమార్క చెప్పారని అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను నట్టేట ముంచిందన్నారు. ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయడంలో ఉన్న శ్రద్ధ రుణమాఫీ చేయడంలో లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. వివిధ శాఖల అధికారుల పోస్టింగ్‌ల విషయంలో అధికారులు మా మాట వినడం లేదని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు చెబుతున్నారని, పోస్టింగ్‌ల విషయంలో మేము ఎలాంటి జోక్యం చేసుకోమని, అధికారులకే పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులుగా ఓడిపోయిన వారికి చెక్కులు పంపిణీ అధికారం ఎవరిచ్చారని, అధికారులు కూడా ప్రోటోకాల్ పాటించకుంటే గతంలో కోర్టుకు వెళ్లి అధికారులపై చర్యలకు ఆదేశాలు ఇప్పించామని వాటిని గుర్తుంచుకొని అధికారులు కూడా మెదలాలి అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.






