మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
సనాతన భారతీయ సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని మాంటిస్సోరి ప్రధానోపాధ్యాయురాలు గీతా షాజు అన్నారు. శనివారం పట్టణంలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓణం పండుగ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఓణం దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగని, మలయాళీ కాల గమనములో క్యాలెండర్ మొదటి నెల చింగంలో ఆగస్టు – సెప్టెంబర్ నెలలో వస్తుందని తెలిపారు. ఈ పండుగ రోజున మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి వస్తాడని కేరళ ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజలు స్నేహభావంతో జరుపుకుంటారని తెలిపారు. ఓణం పండుగ సందర్భంగా పాఠశాలలో చక్కని పువ్వుల మాలలు, కైకొట్టికలి నృత్యములు, ఉపాధ్యాయుల కేరళ సాంప్రదాయ వస్త్రధారణ ఎంతగానో విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ షాజు థామస్, నూకల శ్రీనివాసరావు, గండ్ర సుధాకర్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.