
రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
-ఘనంగా కరీంనగర్ జిల్లా మహాసభ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : సమాజంలో భాద్యత గల పౌరులుగా జర్నలిస్టులు వృత్తి ధర్మాన్ని పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. అదే సమయంలో జర్నలిస్టులపై జరిగే దాడులను ఐక్యంగా ఎదుర్కొంటూ హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ పట్టణంలోని ఎల్ ఐసీ ఏజెంట్స్ భవన్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా నాల్గవ మహాసభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ప్రత్యామ్నాయ యూనియన్ టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూనే, జనం సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యంలో ప్రధాన భూమిక పోషిస్తున్న జర్నలిస్టులు తమ హక్కుల కోసం సంఘటితంగా ఉండాలని అన్నారు. నిరంతర అధ్యయనం, ప్రజా సమస్యలపై కథనాలు అందిస్తూ సమాజంలో తమకంటూ స్థానం పొందాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని, గత ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశాయని అన్నారు. జర్నలిస్టుల సమస్యలను ఇప్పటికే కొత్త ప్రభుత్వానికి విన్నవించామని, ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది మాసాలు గడిచినా పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు, పెన్షన్ స్కీం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఫెడరేషన్ పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న ఇతర జర్నలిస్టు సంఘాలకు ప్రత్యామ్నాయం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అని, జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం ఇదేనని అన్నారు. కొన్ని జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వంలో పదవులు పొంది పాలకులకు తలొగ్గుతూ జర్నలిస్టుల సమస్యలను విస్మరిస్తున్నాయని, పదవులు, పైరవీల కోసం జర్నలిస్టులను పావులుగా వాడుకుంటున్నారని విమర్శించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ మహాసభలు పూర్తిచేసి హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధం కావాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ నివేదిక సమర్పించారు. మహాసభలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం, పెన్షన్ స్కీం వంటి డిమాండ్ల సాధనకు ఐఎఫ్ డబ్ల్యూజే దేశవ్యాప్తంగా పోరాటం చేస్తుందన్నారు. ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ, టీడబ్ల్యూజేఎఫ్ సంఘం ఏ ప్రభుత్వానికి, ఏ పార్టీకి అనుకూలం, అనుబంధం కాదని, కేవలం జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిగ రఘు,
కార్యదర్శులు రాజశేఖర్, బిక్షపతి, జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు, యూసుఫ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయ్, మహేష్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గం ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, ప్రముఖ వైద్యులు బీ ఎన్ రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిడబ్ల్యూజేఎఫ్ కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక :
కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మల తిరుపతిరెడ్డి, కార్యదర్శిగా కుడుతాడి బాపూరావు, ఉపాధ్యక్షులుగా నల్లగొండ సత్తయ్య, లక్కం సురేష్, వెంకట్ రాజు, అతికం రాజశేఖర్, సహాయ కార్యదర్శులుగా ఆంజనేయులు, సాగర్, రాజేంద్రప్రసాద్, శంకర్, గుండి కిరణ్, దేవునూరి రవిందర్, కోశాధికారి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా జి లావణ్య, శంకర్ రెడ్డి, ఖాజా ఖాన్, నీల రాజు, సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ప్రసాద్, రమణ, రవీందర్, నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా దయాకర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.





