
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, సెప్టెంబర్ 18 : తెలుగు రాష్ట్రాలలో పండగలు సమీపిస్తున్న వేళ సామాన్య ప్రజలకు షాకిచ్చింది కేంద్ర ప్రభుత్వం. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20శాతం పెంచింది. దీంతో సన్ ఫ్లవర్, సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్ పై ఇంపోర్ట్ టాక్స్ 12.5శాతం నుంచి 32.5శాతానికి చేరుకుంది. దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే దిగుమతి సుంకం పెంపుతో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి.
మొత్తానికి ముడి నూనెలపై సుంకం 5.5శాతం నుంచి 27.5 శాతానికి రిఫైన్డ్ ఆయిల్స్ పై సుంకం 13.75 శాతం నుంచి 35.75శాతం పెరిగింది. 20శాతం దిగుమతి సుంకం పెరగడంతో అన్ని రకాల నూనెలు 15 నుంచి 20 రూపాయల వరకు ఒక్కసారిగా పెరిగాయి. పామాయిల్ ధర రూ. 100 నుంచి 115 వరకు పెరిగింది. సన్ ఫ్లవర్ అయిల్ 115 నుంచి 130 వరకు, పల్లీ నూనె రూ. 155 నుంచి 170 వరకు పెరిగింది. పూజలకు ఉపయోగించే నూనెలను కూడా భారీగా పెంచింది.
రూ.110 నుంచి 125 వరకు చేరాయి. ఇక ఇదే అదునుగా భావించిన కొంతమంది వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ చేస్తు న్నారు. స్టాక్ లేదంటూ బోర్డులు పెట్టి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. పాత స్టాక్ ను కూడా అధిక ధరలకు అమ్ముతున్నట్టు సమాచారం. కేవలం రెండు రోజుల్లోనే లీటర్ నూనె ధర రూ. 20 పెరగడంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు. ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించేం దుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సామాన్య ప్రజానీకం..
