
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గాలికొదిలినట్టుగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్తు వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆయన పేర్కొన్నారు. బుధవారం వీణవంక మండలం దేశాయిపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, “మాయమాటలతో అధికారం దక్కించుకున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతుందని, హామీల అమలు లేకుండా ప్రభుత్వం ముందుకు సాగాలనుకుంటే, అర్థం చేసుకోవాలి—హామీలు బందు చేస్తే, బొంద తప్పదు!” అని హెచ్చరించారు. రుణమాఫీ హామీ: 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం, 9 నెలల తర్వాత కేవలం 40% రుణమాఫీ మాత్రమే అమలు చేసినందున, ఇది రైతుల కోసం చేసిన ఘోర మోసమని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా: రైతులకు 15 వేల రూపాయలు ఇవ్వాలన్న హామీ ఇంకా నెరవేరలేదని, ఇది సొంత రైతులపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యమని అన్నారు. విద్యుత్ కోతలు: కేసీఆర్ హయాంలో నిరాటంకంగా అందిన 24 గంటల ఉచిత విద్యుత్తు ఇప్పుడు ఎందుకు నిలిచిపోతుందో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల సంక్షేమం: గృహలక్ష్మి పథకం, కళ్యాణ్ లక్ష్మి వంటి హామీలు పత్రికల్లో మాత్రమే మిగిలిపోయాయని, దళితులకు చెప్పిన దళిత బంధు పథకం కూడా పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
“ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు చట్టసభలోనే కాకుండా, ప్రజల మధ్యలోనూ నేను పోరాడతాను,” అని కౌశిక్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. ప్రజల హక్కుల కోసం పోరాటం మొదలైంది, గడపగడపకు పోరాటం తీసుకెళ్లి, ప్రజల సమస్యలను పరిష్కరించే వరకు నేను వెనక్కి తగ్గను,” అని ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలోఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, వీణవంక మండల మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మాడ వనమాల సాదవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్లు విజయభాస్కర్ రెడ్డి, ఎడవెల్లి కొండల్ రెడ్డి, హుజురాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు సంగెం ఐలయ్య, మాజీ జెడ్పిటిసి పడిదం బక్కరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






