
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మున్సిపల్ పారిశుద్ధ్యనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె అధ్యక్షతన హుజురాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 24 అంశాలు ప్రతిపాదించగా అన్నింటినీ పాలకవర్గ సభ్యులు ఆమోదించారు. వాటిలో 1,06,80,000 రూపాయలతో పారిశుద్ధ్య నిర్వహణ కొరకు 2 ట్రాక్టర్లు, (9) స్వచ్చ ఆటోలు కొనుగోలు చేయుటకు, 21,00,000 లక్షల రూపాయలతో దసరా, బతుకమ్మ పండుగలు ఘనంగా నిర్వహించుటకు,
46,800 వేల రూపాయలతో మంచినీటి సరఫరా నిర్వహణకు మోటార్లు రిపేరు కోసం, 68,400 రూపాయలతో కార్యాలయములో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయుటకు, 2,25,128 రూపాయలతో బోర్నపల్లి వెటర్నరీ ఆసుపత్రి నుండి క్రీడా ప్రాంగణము వద్ద గల నల్లాల బావి వద్దకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను మార్చుటకు ఖర్చు చేయనున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించి ఆయన ఉమ్మడి రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కమిషనర్ ఎస్ సమ్మయ్య, వార్డు సభ్యులు, కార్యాలయ మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, TPO బషీర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జి సంధ్యారాణి, ఇంచార్జి మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ జి సాంబరాజు, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ ఏం కిషన్ రావు తదితర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


