
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సందమల్ల నరేష్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యజించారని, ప్రాణాలను సైతం అర్పించారని వీరిలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులు భగత్ సింగ్ అని, ఆయన పేరు వింటే చాలు యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుందని, ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపిందని, గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన వీరుడు భగత్ సింగ్ అని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే దేశ స్వాతంత్ర్యం కోసం తెల్లదొరలతో పోరాడారని, మహాత్మా గాంధీ పిలుపుతో 13 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడని, 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతంతో భగత్ సింగ్ బ్రిటిషర్ల పట్ల ఆగ్రహాన్ని పెంచుకోని లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరిన భగత్ సింగ్ పెళ్లిని కూడా తప్పించుకుని దేశం కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడి తన ప్రాణాలను అర్పించిన ధైర్యశీలి భగత్ సింగ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సందమల్ల బాబు, బిఆర్ గౌడ్, దుబాసి బాబు, కేఆర్ భిక్షపతి, జీ రాఘవేంద్ర, సమ్మయ్య, ముక్క రమేష్, నర్సింగం, యువజన కాంగ్రెస్ నాయకులు చల్లూరి విష్ణువర్ధన్ ముక్క రవితేజ, ఆకునూరి అజిత్, బన్నీ, అనుదీప్ పాల్గొన్నారు.
నియోజకవర్గంలో భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
–ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్
స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో భగత్ సింగ్ 117వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ ముష్కరులను ఎదిరించి పోరాడి దేశానికి స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడడాని పేర్కొన్నారు. భగత్ సింగ్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భగత్ సింగ్ కి భారతరత్న అవార్డు ఇవ్వాలని ట్యాంక్ బండ్ పై భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గంలో భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నేటి విద్యార్థి లోకం భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి రాపేల్లి రోహిత్, రాహుల్, మణిదీప్, రాఘవ, అనిల్, శ్రీకాంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.







