Oplus_131072
–గత వైభవానికి “మెరుగులు” దిద్దడమే ప్రభుత్వాల “గొప్ప” తనమా ?
–కాకతీయుల అద్భుత “కళా” సృష్టికి సిర్సపల్లి “శివాలయమే” తార్కాణం
–దేవాలయాలపై రాజకీయపరమైన కుహనాశక్తుల “నీలి నీడలు”
-“యునెస్కో” వారు స్పందించే వరకు మనవాళ్లు “గాఢ నిద్రలోనే” ?
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తూర్పు నుండి పశ్చిమం వరకు… పడమర నుండి ఉత్తరం వరకు తెలంగాణ వ్యాప్తంగా శతాబ్దాల క్రితమే పురుడు పోసుకున్న అద్భుతమైన శిల్పకళా వైభవం రాను రాను తన ప్రాశస్త్యాన్ని… ప్రాభవాన్ని కోల్పోతున్నది. మన గుళ్ళు… గోపురాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినప్పటికీ మన పాలకుల… మన ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అవి కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని పురాతత్వ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వందల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు… రాజులు… చక్రవర్తులు…. పురాతత్వ శాస్త్రవేత్తల ఊహలకు సైతం అందని విధంగా తీర్చిదిద్దబడిన శిల్పకళలతో కూడిన దేవాలయాలను భావితరాల వారి కోసం కాపాడవలసిన ప్రభుత్వాలు చేతులెత్తేస్తుండడంతో…. చరిత్ర మనకు అందించిన అపూర్వ కళా సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా భద్రాచలం రామాలయానికి ఎంతటి గుర్తింపు ఉన్నదో…. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఇల్లందకుంట మండల కేంద్రంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి సంబంధించిన రామాలయం కూడా అపర భద్రాద్రిగా పిలవబడుతున్న విషయం జగద్విదితమే. ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణం భద్రాచలంలో ఏ స్థాయిలో జరుగుతుందో దాదాపు అదే స్థాయిలో ఉత్తర తెలంగాణలోని ఇల్లంతకుంటలో ఈ కళ్యాణ మహోత్సవ ఘట్టం అదే రీతిలో జరుగుతుండడం మన అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఇల్లందకుంట రామాలయాన్ని నభూతో న భవిష్యత్తు అనే తరహాలో తీర్చిదిద్దవలసిన ప్రభుత్వాలు మొక్కుబడి చర్యలకు మాత్రమే పరిమితం అవుతుండడం పట్ల భక్తులు… సామాన్య ప్రజల నుండి ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నాయి. ఇల్లందకుంట ఆలయ పరిసరాలలో అపారమైన ల్యాండ్ బ్యాంక్ ఉన్నందున పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం శోచనీయం. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆలయం చుట్టూ రాజకీయాలు చేసే నేతలు ఆ తర్వాత తమ హామీలను నిమజ్జనం చేయడం వరకే పరిమితం అవుతుండడం భక్తులను వంచించడమే అవుతుంది.
సిర్సపల్లి “శివాలయం” పై అజ్ఞాత శక్తుల “నీలి నీడలు” ?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో గల శివాలయం కూడా దాదాపు 11,12వ శతాబ్దంలో అనగా సుమారు 800 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు తమ అద్భుతమైన తెలివి తేటలతో… ప్రజ్ఞ పాటవాలతో శిల్పకళా వైభవం ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. దాదాపు 14 గుంటల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఆలయంపై కొన్ని సంవత్సరాల నుండి కొంతమంది వ్యక్తులు పెత్తనం చలాయిస్తున్నట్లు సమాచారం. రామప్ప… వేయి స్తంభాల గుడి వంటి అపురూపమైన దర్శనీయ స్థలాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో అద్భుతంగా చెక్కబడి మానవుని మేధాశక్తికి… అతనిలోని కళాతృష్ణకు ప్రతీకగా దర్శనమిస్తున్న సిర్సపల్లి “శివాలయం” 36 డిగ్రీల కోణంలో నిర్మించబడినట్లుగా తెలుస్తోంది. ఈ ఆలయ ప్రాంగణంలోని కోనేరు ( అనగా స్వయంభు గుండం ) కొన్ని శతాబ్దాల క్రితమే తనంతట తానుగా ఉద్భవించడం ( అనగా వెలిసినట్లు ) నేటికీ ఊహకందని విషయంగానే చెప్పుకోవచ్చు. ఎంతగా కరువు కాటకాలు వచ్చినను… ప్రకృతి వైపరీత్యాలు సంభవించినను ఈ కోనేరులో నీరు మాత్రం “ఇంకి” పోనేపోదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పాతిక సంవత్సరాల క్రితం కెనాల్ లైనింగ్ పనుల కోసం వచ్చిన ప్రసాద్ అండ్ ప్రసాద్ అనే కంపెనీ ఈ ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించిన విషయం విధితమే. ఇక్కడి శివాలయం నుండి అనేక ప్రాంతాలను స్పృశిస్తూ సాక్షాత్తు వేములవాడ వరకు పాదముద్రికలు ఉన్నట్లు సమాచారం. రామప్ప… వేయి స్తంభాల గుడి వంటి దర్శనీయ స్థలాలను తిలకించినప్పుడు ఆ రాతి స్తంభాలను మలచిన తీరును… వివిధ భంగిమలుగా ఆనాటి శిల్పులు తీర్చిదిద్దిన నైపుణ్యాలను… అద్భుత రాతి చెక్కడాలను చూసిన అనుభూతి కలుగడమే కాకుండా ఆ జ్ఞాపకాలు మదిలో స్థిరంగా ఉండిపోతాయి. కానీ రామప్ప… వేయి స్తంభాల గుడి వంటి అద్భుత శిలా సంపద మాదిరిగానే శతాబ్దాల క్రితం నిర్మితమైన సిర్సపల్లి “శివాలయం” మొత్తాన్ని సిమెంట్ తో ఫ్లోరింగ్ చేయడం వల్ల ఈ ఆలయం రాతి స్తంభాలతో నిర్మించబడిందా….. లేక మట్టి దిమ్మెలతో నిర్మించబడిందా అనే విధంగా ప్రస్తుతం దాని పరిస్థితి తయారయింది. దీనంతటికీ గ్రామంలోని కొన్ని అజ్ఞాత శక్తుల స్వార్థపూరిత చర్యలే కారణమని ఊహాగానాలు వినబడుతున్నాయి. శతాబ్దాల క్రితం నిర్మించబడిన అద్భుతమైన కళా సంపదను కాపాడవలసిన నేటితరం… అందుకు విరుద్దంగా వినాశకర విధానాలకు శ్రీకారం చుట్టడాన్ని చరిత్ర ఎప్పటికీ క్షమించదని కొంతమంది గ్రామస్తులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. సిమెంటు కోటింగ్ వల్ల గత వైభవాన్ని… గత ప్రాశస్త్యాన్ని… గతంలోని తేజస్సును కోల్పోయి ఈ శివాలయం అంద విహీనంగా తయారు కావడం పట్ల నిజమైన భక్తులలో ఆవేదన… ఆందోళన వ్యక్తమవుతోంది. వందలాదిమంది శిల్పులు పెద్ద పెద్ద బండరాళ్లను ఏళ్ల తరబడి శ్రమించి అద్భుతమైన కళాఖండాలతో ఈ శివాలయాన్ని నిర్మిస్తే… నేడు గత ఆనవాళ్లు కనుమరుగై కళా విహీనంగా దర్శనమిస్తోంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు అనేక గ్రామాల నుండి భక్తజనులు వేలాదిగా తరలివస్తుండడంతో ఈ గ్రామంతో పాటు శివాలయం ప్రాంగణం కిక్కిరిసి దర్శనమిస్తుంటుంది. దాదాపు కొన్ని వేల మందికి ఆరోజు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతటి ప్రశస్తమైన సిర్సపల్లి శివాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తేవాలని రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ ఒక వర్గానికి చెందిన కొంతమంది ఈ ప్రయత్నానికి అడ్డుపడుతున్నట్లు సమాచారం. దేవాదాయ శాఖ అధికారుల అలసత్వం వల్ల ఈ శివాలయం ఎండోమెంట్ పరిధిలోకి వెళ్లడం లేదా….. లేక కొంతమంది స్వార్థపూరిత చర్యల కారణంగా ఆటంకం ఏర్పడుతోందా అనేది ప్రశ్నార్ధకంగా తయారైంది.
“యాదాద్రి” వరకే పరిమితమైతే మిగతా ఆలయాల పరిస్థితి ఏమిటి ?
హైదరాబాద్ సమీపంలో గల యాదాద్రి దేవాలయాన్ని వేల కోట్ల రూపాయలతో తీర్చిదిద్దితే రాష్ట్రంలోని మిగతా దేవాలయాల పరిస్థితి ఏమిటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అద్భుతంగా నిర్మించబడి ఆ తర్వాత ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు అడుగడుగున ఉన్నాయని… వాటిని జీర్ణోద్ధరణ చేయవలసిన ప్రభుత్వాలు యాదాద్రి వంటి కొన్ని దేవాలయాల అభివృద్ధి వరకే పరిమితమై మిగతా వాటిని గుర్తించకపోవడం ఎంతవరకు సమంజసం అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధికి నోచుకోకుండా మసకబారిన శిల్పకళా సౌందర్యంతో ఉట్టిపడే ప్రతి ఆలయాన్ని గుర్తించి భక్తుల మనోభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దినట్లయితే రాష్ట్రంలో కొత్తగా అనేక టూరిజం స్పాట్లు ఏర్పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రకటనల వరకే పరిమితమైతే ఎలా !?
వేములవాడ… కొండగట్టు దేవస్థానాలను 100 కోట్ల చొప్పున నిధులు కేటాయించి తెలంగాణకే తల మానికంగా వాటిని తీర్చిదిద్దుతామని ప్రభుత్వాలు ప్రకటనలు ఇవ్వడం తప్ప ఏళ్లు గడుస్తున్నప్పటికీ తాము ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం పట్ల ముఖ్యమంత్రి లాంటి నేతల పట్లనే ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందనినే వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. ప్రతి సంవత్సరం పొడవునా సాధారణ భక్తులు… అంజన్న భక్తులు లక్షలాదిగా తరలివచ్చే కొండగట్టు పుణ్యక్షేత్ర పరిస్థితి దశాబ్దాల తరబడిగా దారుణంగా ఉంటున్నప్పటికీ స్పందించడానికి ఇంతవరకు ఏ ఒక్క ప్రజా ప్రతినిధి ముందుకు రాకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందడం వల్ల ఉత్సవాల సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుందని… ఎవరు శ్రద్ధ చూపడం లేదని కొత్తకొండ ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. హుస్నాబాద్ శివారులో ఒక రైతు పొలం నుండి 20 సంవత్సరాల క్రితం అతిపెద్ద శివలింగం బయల్పడగా… పొట్లపల్లి గ్రామస్తులు సంఘటితమై రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించి ప్రతి ఏటా తమ సొంత ఖర్చులతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయాన్ని స్వయంభు దేవాలయంగా ప్రతి ఒక్కరు పిలుస్తుండడంతో సిద్దిపేట జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం దర్శనీయస్థలంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.
“యునెస్కో” వాళ్లు స్పందించే వరకు మన ప్రభుత్వాలు “నిద్రావస్థలోనే” ?
ప్రపంచ ప్రాచీన వారసత్వ సంపదగా రామప్ప…. వేయి స్తంభాల గుడి ప్రాంతాలను యునెస్కో వాళ్లు గుర్తించే వరకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రావస్థలోనే ఉండడం దారుణమైన విషయమని… యునెస్కో స్పందన తర్వాత బిజెపి నేత కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుండి కొన్ని నిధులు మంజూరు చేయించారని… ఆ తర్వాత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైనట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత బిగ్గెస్ట్ జన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క… సారలమ్మలు కొలువుండే ప్రాంతాన్ని కొన్ని వేల కోట్లతో అభివృద్ధి చేయవలసి ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం విషయంలో పోటీపడుతుండడం ఎంతైనా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ చూపి మన ఆలయాలను… మన శిల్పకళ సంపదను పదిలంగా కాపాడినప్పుడే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆనాటి తరాలకు చెందిన “శిల్పుల” ప్రజ్ఞ పాటవాలను మనం గుర్తించినట్లు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదేమో.











