మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్: ప్రముఖ సామాజికవేత్త, జెన్ ప్యాక్ట్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ఏ మానస అనారోగ్యంతో బాధపడుతుండగా విషయాన్ని తెలుసుకున్న సబ్బని వెంకట్.. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆమె చికిత్స నిమిత్తం రూ. 2.50 లక్షలు మంజూరు చేయించారు. మానస తండ్రి గతంలోనే మృతి చెందారు. అత్యంత నిరుపేద అయిన మానస బాసర ట్రిపుల్ ఐటీలో నాలుగో సంవత్సరం చదువుతోంది. గత కొద్ది కాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతోంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న మానస కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న వెంకట్.. వెంటనే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎల్ఓసి మంజూరు అయ్యేందుకు కృషి చేశారు. ప్రస్తుతం మానస హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతోంది. మానస చికిత్స కోసం ఎల్ఓసి మంజూరు చేయించి, తన అనుచరుల ద్వారా మానసకు అందించారు. సబ్బని వెంకట్ ను పలువురు అభినందిస్తున్నారు. అలాగే మానస అనారోగ్యం నుండి త్వరలోనే కోరుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.