–ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది నిజం కాదా..!?
–మరోసారి కౌశిక్ రెడ్డిని విమర్శిస్తే గ్రామాల్లో తిరుగనీయం..
–బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండలరెడ్డి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలతో అమాయక ప్రజలను తప్పుదారి పట్టించి, ఆరు గ్యారంటీల హామీతో బోల్తా కొట్టించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక మోసగించింది నిజం కాదా ! అని హుజురాబాద్ సింగిల్విండో చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎడవెల్లి కొండారెడ్డి పేర్కొన్నారు. శనివారం హుజురాబాద్ పట్టణంలో ఆయన బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసాలపై హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే హుజురాబాద్ దాటని కాంగ్రెస్ నేత వోడితెల ప్రణవ్ తన స్థాయిని మరిచి ఎమ్మెల్యేను విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా ఎన్నిక కానీ ప్రణవ్ డబ్బులు ఇచ్చి పార్టీ టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల చేతిలో ఓటమి చవిచూసినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచి మగాడిగా మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డిని ప్రణవ్ తన స్థాయిని మరిచి నువ్వు మగాడివైతే అని పలుమార్లు పేర్కొనడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేసామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు మహిళలకు మహాలక్ష్మి పేరుతో రూ .2500 ఎక్కడ ఇచ్చారో తెలుపాలని, బాలింతలకు ఆరోగ్యశ్రీ పేరుతో కాంగ్రెస్ పార్టీ అందించే కిట్టు ఇవ్వడం మర్చిపోయారని, కల్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎక్కడిచ్చారో చూపెట్టాలని కొండారెడ్డి పేర్కొన్నారు. పంటలకు బోనస్ పేరుతో రూ .500 ఎప్పుడు ఇచ్చారో చూపెట్టాలని, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎంతమందికి ఇండ్లు అందించారో చూపెట్టాలని ఆయన ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి జోకర్.. మీడియా పిచ్చి అనీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబుకే మీడియా పిచ్చి ఉందని, ఆయన స్థాయిని మరిచి మీడియాతో స్థాయికి మించి మాట్లాడుతూ ప్రజలలో చులకన అవుతున్నారన్నది గుర్తుపెట్టుకోవాలనీ అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తెచ్చిన నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కానీ ప్రత్యేకంగా ప్రణవ్ బాబు గానీ కాంగ్రెస్ పార్టీ గాని ఇచ్చిన నిధులతో జరిగే ఏ ఒక్క అభివృద్ధి పనినైనా ప్రజలకు చూపెట్టాలని కొండారెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని.. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చినప్పుడే అది రుజువైందని కొండాల్ రెడ్డి పేర్కొన్నారు. పేద ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని.. కాంగ్రెస్ నేతల అవినీతి అక్రమాలపై పోరాడుతుందని తెలిపారు. కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు తన స్థాయిని మరిచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని విమర్శిస్తే నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరగకుండా బిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటారని కొండాల్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు డాక్టర్ సంఘం ఐలయ్య, సీనియర్ నాయకులు దాసరి రమణారెడ్డి, పోరెడ్డి దయాకర్ రెడ్డి, సంగేమ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.