– గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముందు వరుసలో నరేందర్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కోడ్ కూయక ముందే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై వాడి వేడి పెరిగిపోతుంది. నోటిఫికేషన్ రాకముందే అధికార కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ మొదలైంది. అదృష్టం ఉంటే కోరుకున్న రాజకీయ పార్టీ నుంచి టికెట్ రావచ్చు అనుకుంటారు కొందరు. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇప్పటికే ప్రచారంలో ముందు వరుసలో దూసుకుపోతున్న ప్రముఖ విద్యావేత్త డాక్టర్ వి నరేందర్ రెడ్డిని సరైన వ్యక్తిగా భావించి సీఎం రేవంత్ రెడ్డి, ఆ పార్టీ అధిష్టానం నుంచి శనివారం పిలుపు వచ్చినట్లు తెలిసింది. నరేందర్ రెడ్డి గత కొన్ని నెలలుగా ప్రచారంలోకి దిగీ తమదైన శైలిలో ప్రచారం చేపడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. దీంతో పట్టభద్రుల మండలి పోరులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆశావహులలో ముందు వరుసలో నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై నజర్ వేసిన అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న వారిలో విద్యాసంస్థల అధినేతగా, సామాజికవేత్తగా, సంఘసంస్కర్తగా, ప్రజాబలం కలిగిన నాయకుడిగా వి నరేందర్ రెడ్డి ముందు వరుసలో నిలవడంతో పార్టీ అధిష్టానం నజర్ ఆయన పై పడింది. అంతేకాక నరేందర్ రెడ్డికి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. క్రమంగా నరేందర్ రెడ్డికి ఆయా జిల్లాల్లో పట్టభద్రుల నుంచి కూడా మద్దతు పెరుగుతుండటం, పట్టభద్రులను ఎన్ రోల్ చేయడంలో కూడా నరేందర్ రెడ్డి ముందు వరుసలో నిలవడం ఆయనకు కలిసి వచ్చిన అంశంగా భావిస్తున్నారు. పలువురు ఆశావహులు పోటీ పడుతుండటంతో ఈసారి డాక్టర్లు, విద్యావేత్తలు. న్యాయవాదులు, మేధావులు బరిలో ఉంటున్నట్లు ప్రకటించడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం ఎంతో ఛాలెంజ్ గా తీసుకొని గెలుపు గుర్రాన్ని బర్రిలో నిలపాలని భావిస్తుంది. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా గత 34 ఏళ్లుగా విద్యావేత్తగా కొనసాగుతున్న నరేందర్ రెడ్డి అయితే సరైన వ్యక్తి అని భావిస్తున్నట్లుగా తెలిసింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కాంగ్రెస్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి పదవీకాలం 2025 మార్చి 29తో ముగియనుండడంతో అధిష్టానం ఈసారి కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇంకా ఐదు మాసాల సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ గెలుపు గుర్రాలపై దృష్టి సారించడముతో ఈ నెలలో గ్రాడ్యుయేట్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఇప్పటినుంచే ఆశావహులు సైతం ఎన్ రోల్ పై పోకస్ పెట్టడంతో పాటు టిక్కెట్టు కోసం కూడా పోటీ పడుతున్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా సరైన వ్యక్తి ఆల్ఫోర్స్ విద్యాధినేత వి.నరేందర్ రెడ్డి అయితేనే సరైన వ్యక్తిగా కాంగ్రెస్ అధిష్టానం భావించి ఆయనకు శనివారం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు రావడం ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం చర్చనీయాంశమయింది. నరేందర్ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు ఉండడం, తన స్టూడెంట్స్ పట్టభద్రులు సుమారు 50 వేలకు పైగా ఉండి ఓటర్లుగా నమోదు చేసుకుంటూ ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశం. అందరికంటే ముందుగా నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రచార కార్యాలయాలను కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో ప్రారంభించడంతో పాటు ప్రచారంలో దూసుకుపోవడం, ఏ పార్టీ వారు టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా నైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించడంతో అధిష్టానం అలాంటి వ్యక్తిని ముందే పార్టీ టికెట్ ఇచ్చి ప్రకటిస్తే 100% విజయం సాధిస్తాడని నిర్ధారణకు వచ్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏదిఏమైనాప్పటికీ విద్యావేత్త నరేందర్ రెడ్డి కి శనివారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం ఆయన వర్గీయుల్లో టికెట్ నరేందర్ రెడ్డి కి వస్తుందన్న చర్చ మొదలైంది. కచ్చితంగా నరేందర్ రెడ్డికి అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఒకవేళ ఆయనకు టికెట్ కనుక ఇచ్చినట్లయితే గెలుపు నల్లేరు మీద నడకే నని.. భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అభిమానులు, ఆయన పూర్వ విద్యార్థులు, పట్టభద్రులు పలు విద్యాసంస్థల నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.