
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రముఖ తెలంగాణ ఉద్యమ కారులు, సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత నేత వెలిచాల జగపతిరావు విగ్రహ ఏర్పాటుతోపాటు మానేరు రివర్ ఫ్రంట్ కు ఆ మహా నాయకుడి పేరు ప్రభుత్వం పెట్టాలని కృషి చేసేందుకు గానూ ఆయన అభిమానులు అంతా కలిసి ఒక సాధన సమితిని సోమవారం ఏర్పాటు చేసుకున్నారు. కరీంనగర్ పరిధిలో జగపతిరావు విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని వీరంతా ఇటీవల మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కి వినతి పత్రం అందజేశారు. అలాగే కరీంనగర్ ఉజ్వల పార్కుకు వెలిచాల జగపతిరావు పేరు పెట్టాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేశారు. సోమవారం కరీంనగర్ లో జగపతిరావు అభిమానులంతా సమావేశమై వెలిచాల జగపతిరావు విగ్రహ ఏర్పాటు, మానేరు రివర్ ఫ్రంట్ కు వెలిచాల పేరు పెట్టేలా ప్రభుత్వం కృషి చేసేలా ఓ సాధన సమితిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సాధన సమితికి కన్వీనర్ గా సరిల్ల రతన్ రాజు, కో కన్వీనర్ గా గండి రాజేశ్వర్, అడ్వైజర్లుగా దర్శనాల నారాయణ, ఎండి ఖషిద్, పులి నరసింహారావు, డైరెక్టర్ గా చిందం శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధికి జగపతిరావు ఎనలేని కృషి చేశారని తెలిపారు. కరీంనగర్ రూపురేఖలే మార్చిన మహానీయుడు జగపతి రావు అని పేర్కొన్నారు. పేదల బంధువుగా వారి సంక్షేమానికి నిరంతరం పాటుపడిన గొప్ప నేత వెలిచాల చెప్పారు. ఆ మహానీయుడికి జ్ఞాపకంగా విగ్రహం ఏర్పాటుకు స్థలంతో పాటు ఉజ్వల పార్కు, మానేరు రివర్ ఫ్రంట్ కు జగపతిరావు పేరు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుకి, కరీంనగర్ ఎంపీ, కరీంనగర్ ఎమ్మెల్యే, మేయర్, కరీంనగర్ కార్పొరేటర్లు అందరికీ వినతి పత్రాలు అందించి విన్నవిస్తామని సాధన సమితి ప్రతినిధులు నిర్ణయించారు.
