
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్లో నివసించే హెల్త్(ల్యాబ్) అసిస్టెంట్ వకులాభరణం రమేష్ (50) శుక్రవారం రాత్రి పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో దుర్మరణం చెందారు. రమేష్ గత కొన్ని ఏళ్లుగా పట్టణంలోని డాక్టర్ రామలింగారెడ్డి దావకానలో ల్యాబ్ అసిస్టెంట్ గా సేవలందించగా,ప్రస్తుతం ఎల్కత్తూర్తి మండలలో హెల్త్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకొని విద్యానగర్లోని ఇంటికి వెళ్తుండగా అన్నపూర్ణ చౌరస్తా రోడ్డు దాటుతుండగా సైదాపూర్ క్రాస్ రోడ్డు వైపు వెళ్తున్న క్రమంలో భూపాలపల్లికి చెందిన కారు అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి రమేష్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో క్రాస్ రోడ్ లోని పండ్ల బండ్ల వద్ద ఎగిరిపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రమేష్ కు గత ఐదేళ్ల క్రితమే భార్య మృతి చెందగా పెళ్లీడుకు ఎదిగిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రజలతో మమేకమై అంకితభావంతో కొన్నేళ్ల క్రితం ల్యాబ్ అసిస్టెంట్ గా సేవలందించిన రమేష్ ప్రభుత్వ వైద్యవర్గ శాఖలో హెల్త్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ కుటుంబం చక్కదిద్దుకుంటున్న క్రమంలో ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని మిత్రులు, బంధువులలో తీవ్ర విషాదం నెలకొంది.







