
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, నవంబర్ 26:
తెలంగాణలో ఉద్యమాలకు కరీంనగర్ ఊపిరి పోస్తుందని మరోసారి నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 29న కరీంనగర్ జిల్లాలో జరగనున్న దీక్షా దివాస్ లో 20 వేల మందికి పైగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
మంగళవారం కరీంనగర్లో జరిగిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్‌కి రానున్న సందర్భంగా ఘన స్వాగతం పలకాలని పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాటం చేయడం అత్యవసరమని ఆయన సూచించారు. తెలంగాణకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు.
దీక్షా దివస్ కార్యక్రమం కరీంనగర్‌కి ప్రత్యేక గౌరవాన్ని తీసుకువస్తాయని, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ తీరును ప్రశ్నించడంలో బీఆర్ఎస్ ముందంజలో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చెర్మన్ బండ ప్రకాశ్, మాజీ మంత్రి గంగుల కమలాకర్, జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణరావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



