
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, డిసెంబర్ 5: అసెంబ్లీలో అడుగుపెట్టకుండా నిలువరించేందుకే సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేశారని, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ ఆరోపించారు. పట్టణంలోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిఆర్ ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు నిన్న వెళ్లిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పట్ల బంజారాహిల్స్ సీఐ, పోలీసులు దురుసుగా ప్రవర్తించి, అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం అత్యంత దారుణమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యల్లో భాగంగా పథకం ప్రకారమే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేసిందన్నారు. తక్షణమే కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డిలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు వెళితే వారిపై కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వదిలిపెట్టడం వారి కుట్రకు నిదర్శనం అన్నారు. ఎమ్మెల్యేలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉప సంహరించుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గ్యారంటీలు అమలు చేయకుండానే ప్రజా విజయోత్సవాలని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బండ శ్రీనివాస్ ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న సంబరాలకు అర్థం లేదన్నారు. ఉద్యమంలో ఇటువంటి ఎన్నో అరెస్టులను చూశామన్నారు. ఎంత అణచివేయాలని చూసినా భయపడేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించి అక్రమ కేసులు బనాయిస్తే దానికి తగిన మూల్యం తర్వాత చెల్లించాల్సి వస్తుందని శ్రీనివాస్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగెం అయిలయ్య, సీనియర్ రాష్ట్ర నాయకులు ఇరుమల్ల సురేందర్ రెడ్డి, పొరెడ్డి దయాకర్ రెడ్డి, ఎండి ఇమ్రాన్, తొగరు బిక్షపతి, తొగరు శివ, నాయకులు కాసగోని కిరణ్ గౌడ్, పంజాల సదానందం, మండ సతీష్ గౌడ్, తాళ్లపల్లి వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్యు నాయకులు విడపు అనురాగ్, సాయి, బన్నీ భరత్ తదితరులు పాల్గొన్నారు.

