
–కాంగ్రెస్ ది అభయ హస్తం కాదు.. బస్మాసుర హస్తం…!?
–అధికారం కోసం కాంగ్రెస్ గ్యారంటీల గారడి చేసింది.. ప్రజా పాలన ఫెయిల్…
–6గ్యారంటీలు, హామీలతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది..
–వేలకోట్ల రైతు భరోసా ఏగనామం పెట్టింది..
– భరోసా ఇవ్వకుండా, అరకోర రుణమాఫీ చేసి రైతు పండుగ పేరిట డ్రామాలు చేస్తుంది.
–కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు..
-ఏం ఉద్ధరించారని సంబరాలు విజయోత్సవాలు…?
–బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కాంగ్రెస్ ది అభయ హస్తం కాదని , భస్మాసుర హస్తమని , అధికారంలోకి వచ్చి ఏం ఉద్ధరించిందని సంబరాలు, విజయోత్సవాలు చేసుకుంటుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రశ్నించారు. బిజెపి పోరుబాట కార్యక్రమంలో భాగంగా గురువారం బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎర్రబెల్లి సంపత్ రావు అధ్యక్షతన హుజరాబాద్ లో సభ నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల మీదుగా భారీ వాహన ర్యాలీని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ ఏడాది ప్రజాపాలన ఫెయిలయిందన్నారు. ఏడాది పాలనపై కాంగ్రెస్ విజయోత్సవాలు సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకా..?
80వేల కోట్లు అప్పులు తెచ్చినందుకా..? 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసినందుకా, ఆడబిడ్డలకు రూ .2500 ఇవ్వనందుకా, నిరుద్యోగులకు భృతి 4016 ఇవ్వనందుకా, రైతు భరోసా ఎగ్గొట్టినందుకా, రైతులందరికీ రుణ మాఫీ చేయనందుకా, పేదలకు ఇళ్ల స్థలాలు .. గృహ నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వనందుకా,అని కృష్ణ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ కోకోల్లల హామీల్లో ఏ వర్గాన్ని ఆదుకున్నదో ముందు సమాధానం చెప్పి విజయోత్సవ వేడుకలు చేసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అధికారం కట్టబెట్టినందుకు ప్రజానీకాన్ని ఏడిపిస్తున్నారని, అందలమెక్కి.. రాష్ట్రాన్ని ఆగం చేస్తుండ్రని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారన్నారు.కాంగ్రెస్ అధికారం కోసం ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారని, 6 గ్యారెంటీలు, 420 హామీలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయకుండా ఏడాది కాలం వెల్లదీసి
గొప్పలు చెప్పుకోవడానికి మళ్లీ ప్రజాధనాన్ని దుర్వినియం చేస్తూ వేడుకలు చేసుకోవడం సిగ్గు చేటన్నారు. ఎన్నికల్లో గెలుపు ఆరాటం తప్ప మరో ఆలోచన లేకుండా నోటికొచ్చిన హామీ లిచ్చారని, వాటిని నెరవేర్చలేక నేడు కాంగ్రెస్ కుంటిసాకులు చెబుతుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని తెలిసి కూడా , రాష్ట్ర అర్థిక స్థితిగతులపై అవగాహన ఉండి కూడా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా హామీలిచ్చారని, 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల హామీని అమలు చేస్తామని ఏడాదైనా ఏ ఒక్క గ్యారంటీని సక్రమంగా పూర్తి చేయకుండా, మళ్లీ తామేదో చేసినట్లు సంబురాలంటూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేకపోయిందని ఆరోపించారు. ముఖ్యంగా రైతులకు రైతు భరోసా రూ .7500 ల ను ఎగ్గొట్టిందన్నారు. మహిళలకు నెలకు రూ .2500 ఇస్తామని చెప్పి నేడు ఆ విషయంపై ఊసే ఎత్తడం లేదన్నారు. ఇక విద్యార్థినిలకు, యువతులకు స్కూటీలు ఇస్తామని ఆశ చూపి ఓట్లు దండుకొని ఇప్పుడు ఆ మాట గుర్తు లేనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రూ.500 గ్యాస్ ఇస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ఎంతమందికి ఇస్తుందో చెప్పాలన్నారు. ఉచిత కరెంటు, గ్యాస్ కోసం ఆడబిడ్డలు సంబంధిత కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారని చెప్పారు. ఇక నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిమోసం చేశారన్నారు. వృద్ధాప్య ,ఒంటరి మహిళా, వికలాంగుల పింఛన్లను పెంచుతామని మోసం చేసిందన్నారు. అలాగే రైతులను నిలువునా మోసం చేసిందన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి.. కొంతమందికే రుణమాఫీ చేసిందన్నారు. రుణమాఫీ కాలేదని రైతులు బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక సన్నాలకే బోనస్ అంటూ రైతాంగాన్ని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని బిజెపి ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ నయ వంచన పాలన, మోసంపై ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. హుజురాబాద్ నియోజకవర్గ సభలో బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మల రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్, ప్రోగ్రాం కో- కన్వీనర్ పుప్పాల రఘు ,జిల్లా కార్యదర్శి చెన్నమాధవుని నరసింహ రాజు, జిల్లా అధికార ప్రతినిధి మాసాడి ముత్యం రావు, హుజూరాబాద్ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, జిల్లా అధికార ప్రతినిధి శోభన్ బాబు,మాజీ జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్, హుజురాబాద్ పట్టణ కౌన్సిలర్లు పైల వెంకటరెడ్డి, నల్ల సుమన్ నియోజకవర్గ బీజేపీ జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, జమ్మికుంట మండల అధ్యక్షులు సంపెల్లి సంపత్ రావు, వీణవంక మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి, ఇల్లంతకుంట మండల అధ్యకులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డిలతోపాటు యాంసాని శశిధర్, పోతుల సంజీవ్, తూర్పాటి రాజు, వోడ్నాల విజయ్, రావుల వేణు, వోడ్నాల చంద్రిక, , తిప్పబత్తిని రాజు, గంట సంపత్, పాడారి కొమరయ్య, నరాల రాజశేఖర్, మోతే తిరుపతి, యాళ్ల సంజీవరెడ్డి, మధిర రమేష్, చంద్రిక, కుసుమ సమ్మయ్య, తల్లపెల్లి దేవేంద్ర, ఆవుల సదయ్య, హరీష్, వినయ్, క్యాస వెంకటేష్, కొండల్ రెడ్డి మాజీ సర్పంచులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










