
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అఖండ భారత ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు,
తెలుగు వారి ప్రతిష్ట కోసం ప్రాణ త్యాగం చేసిన ఏకైక వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేను అని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధాని, దేశ తొలి హోం శాఖా మంత్రి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఉక్కుమనిషి, భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అఖండ భారతావని ఐక్యత కోసం పాటుబడ్డ నిజమైన దేశభక్తుడని ఆయన చేసిన సేవలు మరువలేనివని, సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఘనంగా నివాళులు అర్పించారు. నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్త కల్పించిన ధీరుడు, బ్రిటీష్నర్లను ఎదురించిన స్వాతంత్ర సమరసేనాని దేశంలో 550 కి పైగా ఉన్న సంస్థానాలను విలీనం చేసి దేశం ఐక్యత కోసం పాటుబడ్డ సిసలైన దేశ భక్తుడు వల్లభాయ్ పటేల్ అని రామారావు కొనియాడారు. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగ నిరతి సేవలు మరువలేనివని తెలుగు వారి ప్రతిష్ట కోసం, సంకల్ప సిద్ధి కోసం ప్రాణ త్యాగం చేసి అమరజీవిగా నిలిచిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, ఆయన ప్రాణ త్యాగ ఉద్యమ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని పేర్కొంటూ పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా పోలాడి రామారావు ఘనంగా నివాళులు అర్పించారు. షెడ్యూల్డ్ కులాల వారి హక్కుల కోసం పొట్టి శ్రీరాములు పోరాడారని తెలిపారు.
సమాఖ్య కార్యాలయంలో ఆదివారం సర్దార్ వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములుల వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించినట్లు పోలాడి రామారావు తెలిపారు.






