
–కరీంనగర్ పోలీసు కమీషనర్ తో పాటు మానకొండూరు పోలీసు స్టేషన్ వార్షిక తనిఖీలో పాల్గొన్న ట్రైనీ ఐ.పి.ఎస్. యాదవ్ వసుంధర ఫౌరెబి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని మానకొండూరు పోలీస్ స్టేషన్ ను మంగళవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేసారు. పోలీసుస్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాదీనంలో ఉన్న వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకున్నారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సిసిటిఎన్ఎస్ లో పొందు పరచాలన్నారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేసారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. నమోదైన సైబర్ నేరాల గురించి తెలుసుకున్నారు. విసిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల వారీగా పోలీసు స్టేషన్ పరిధిలోని అన్నీ గ్రామాలకు పోలీసు అధికారులను కేటాయించాలని ఆదేశించారు.
నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేసారు. పోలీసు స్టేషన్ లో అన్ని రకాల విధులను సక్రమంగా నేర్చుకోవాలన్నారు. రికార్డ్ నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షను, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు మొదలుగు విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని తెలిపారు.
రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రైనీ ఐ.పి.ఎస్. యాదవ్ వసుంధర ఫౌరెబి, మానకొండూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.










