
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: అహింసా, శాంతియుత సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు మనమందరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. మహాత్మాగాంధి వర్ధంతి సందర్భంగా గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంపూర్ చౌరస్థాలోని మహాత్ముని విగ్రహానికి పోలాడి రామారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ శాంతి, అహింసా, సత్యాగ్రహం అనే ఆయుధాలతో దేశ స్వాతంత్రం కోసం మన జాతిపిత మహాత్మాగాంధీ, లాలా లజపతిరాయి, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర తిలక్, భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, గోపాలకృష్ణ గోఖలే, మౌలానా అబుల్ కలాం ఆజాద్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఎందరో మహ నాయకులతో కలిసి మహోద్యమాన్ని నడిపించి బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి ఆగస్ట్ 15 ,1947 సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్రం సిద్దింప చేశారని రామారావు గుర్తు చేశారు. మహాత్ముని ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతూ త్యాగ ధనులందరికీ జోహార్లు అర్పిస్తూ దేశ సమైక్యతకు మనమందరం పాటు పడాలని పోలాడి రామారావు పిలుపు నిచ్చారు.
