
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఓసీల్లోని ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు ప్రస్తుతం అమలులో ఉన్న పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దుచేయించేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని, ఎన్నో ఏళ్లుగా రాష్ట్రాల, జాతీయ స్థాయిలో తాము పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణా ఉద్యమ తరహాలో ప్రతిఘటించి ప్రభుత్వాలను స్తంభింపజేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో ఓసీ సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరించారు. సిఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖ ప్రతులను మీడియాకు పోలాడి రామారావు అందజేసి మాట్లాడారు. ఓసీలను కించపర్చుతూ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అవాకులు చవాకులు, అసంబద్ధ ప్రేలాపనలతో పెట్రేగి పోతున్న బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికార పార్టీ ఎంఎల్ సి తీన్మార్ మల్లన్న, యితర ప్రజాప్రతినిధుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పోలాడి రామారావు తెలిపారు. వీరి వైఖరిపై రేవంత్ రెడ్డి స్పందించి చర్యలు తీసుకొని కట్టడి చేయాలని రామారావు డిమాండ్ చేశారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని కుల మతాల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితి గతుల ఆధారంగా యితర అన్ని వర్గాల పేదలతో పాటు ఓసీ ల్లోని నిరుపేదలకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు.
రాజ్యాంగం ద్వారా వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఆపడం ఎవరి తరం కాదని కొందరు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అదే జరిగితే ఓసీ సామాజిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణా ఉద్యమ తరహాలో ఉదృతంగా ఉద్యమిస్తామని పోలాడి హెచ్చరించారు. ఓసిల్లోని పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడమంటే యితర వర్గాల రిజర్వేషన్లను వ్యతిరేకించడం కాదని పేదరికం ప్రాతిపదికన ఇచ్చే అంశంగా పరిగణించాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్ళలో అప్పటి సామాజిక పరిస్థితుల కనుగుణంగా ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన దళిత, ఆదివాసీ గిరిజనుల కోసం పదేండ్ల10 కాలపరిమితికి మాత్రమే కేవలం విద్యా, ఉద్యోగాల్లో 22న్నర శాతం రిజర్వేషన్లను రాజ్యాంగం కల్పించిందన్నారు. పదేళ్లకు ముగించాల్సిన అట్టి రిజర్వేషన్లను రాజకీయ పార్టీల నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాల కోసం ఏడు దశాబ్దాలకు పైగా విద్యా ఉద్యోగాలతో పాటు యితర రంగాల్లో కూడా రిజర్వేషన్లను అమలు చేస్తూ 22 న్నరశాతం రిజర్వేషన్లను 50 శాతం వరకు పెంచారన్నారు. జనరల్ కేటగిరిలోకూడా యితర వర్గాల వారు పోటీపడుతున్న తరుణంలో ఓసీ లకు 10పది శాతం కూడా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్క లేదన్నారు.
దీంతో ప్రతిభ జ్ఞాన సముపార్జన ఉన్న ఓసీ సామాజిక వర్గీయులైన రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, వెలమ, కమ్మ, మార్వాడీ, ఇతర ఓసీ యువతకు విద్యా సంస్థల్లో ప్రవేశాలు లభించక, ఉన్నత విద్యకు నోచుకోలేక ఉద్యోగాలు రాక, ఉన్నత స్థానాలకు చేరుకోలేక అనేక అవకాశాలు చేజార్చుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తించక, వ్యవసాయం అనుకూలించక ఉపాధి కోసం, ఉపాధి హామీ కూలీలుగా, అడ్డమీది దినసరి కూలీలుగా మారి దుర్భర జీవితాలను కొనసాగిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అగ్రకుల పేదలకు న్యాయం చేయాలని తమ ఓసీ సామాజిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా చేసిన అలుపెరుగని అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన అగ్ర కుల పేదలకు విద్యా ఉద్యోగ రంగాల్లో 10 పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించి కేంద్ర ప్రభుత్వ రంగాల్లో అమలు చేస్తుందని పోలాడి రామారావు గుర్తు చేశారు.
తెలంగాణా రాష్ట్రంలో ఇట్టి రిజర్వేషన్ల అమలుకు రెండేళ్లపాటు జరిగిన ఓసీల సుదీర్ఘ ఉద్యమం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంటే సహించలేని కొందరు ఇట్టి రిజర్వేషన్ల రద్దుకు కుట్రలు పన్ని, ప్రకటనలు చేస్తూ, వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వంపై ఒత్తిడికి పెంచేందుకు ప్రయత్నించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు రామారావు పేర్కొన్నారు.
ఓసి ల రిజర్వేషన్ల అమలు తీరుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రామారావు డిమాండ్ చేశారు.
కుహనా శక్తుల కుట్రలను తిప్పికొట్టేందుకు సంఘటితంగా ఎదుర్కునేందుకు తమ ఓసీ సంఘాలన్నీ మరోపోరాటానికి సిద్ధమవుతున్నాయని త్వరలో ఓసీ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో రౌండ్ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని రామారావు వెల్లడించారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని అన్ని వర్గాల్లోని పేదలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఓసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి పలక వర్గాలను నియమించాలని రామారావు కోరారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టం చాలా ప్రాంతాల్లో దుర్వినియోగం అవుతుందని, దీనిని పకడ్బందీగా అమలు చేస్తూ దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ చట్టం అన్ని కులాల వారికి వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓసీ ఐకాస రాష్ట్ర, వివిధ జిల్లాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
