
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడమే లక్ష్యంగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మానకొండూర్ మండల కేంద్రంలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో పార్టీ మండలశాఖ అధ్యక్షుడు నందరిగి రవీంద్రచారి అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా కృషి చేసి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో అలసత్వం ప్రదర్శించడం వల్ల నియోజకవర్గంలో మెజార్టీ సాధించుకోలేక పోయామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అలాంటి సమస్య ఉత్పన్నం కాకూడదని ఆయన స్పష్టం చేశారు. మన విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే ఎంతోమంతి నిరుపేద విద్యార్థులకు చదువులకు సాయపడుతున్న ఆల్పోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇందుకు కోసం పట్టభద్రుల ఇంటింటా ప్రచారం నిర్వహించాలని, ఏ మాత్రం పట్టు సడలకుండా గట్టి ప్రయత్నాలు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కోరారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు కాంగ్రెస్ అభ్యర్థిపైన తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారని, అలాంటి వారిని తిప్పికొడుతూ ప్రజలను జాగృతపర్చాలని డాక్టర్ కవ్వంపల్లి కోరారు.
ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, మానకొండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కనకం అశోక్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోండ్ర సురేశ్, పార్టీ నాయకులు రామిడి తిరుపతి, సాయిరి దేవయ్య, మీస సత్యనారాయణ, ఇర్ఫాన్, ఎర్రల కవిత, బుర్ర శ్రీధర్, గొల్లెన కొమురయ్యతో పాటు వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, బూత్, క్లష్టర్ ఇంచార్జీలు పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, హాజరైన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు.