
–తెలంగాణ ప్రజలంతా మళ్లీ కేసీఆర్ కావాలంటున్నారు
–హామీల అమలుపై ప్రజల గొంతుక అవుదాం…
–ఇల్లందకుంట మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరం కష్టపడి పనిచేసి హుజురాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ జండా మరోసారి ఎగరవేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం హుజురాబాద్ కేసి క్యాంపులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇల్లందకుంట మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు నెరవేర్చడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడవకముందే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీయాలని, హామీలన్నీ నెరవేర్చే వరకు కాంగ్రెస్ నాయకులను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణకు కెసిఆర్ అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. మరోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారని అన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పూర్తిస్థాయిలో ఉందని ఆయన అన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల గొంతుకలం కావాలని అన్నారు. అతి త్వరలోనే సర్పంచ్ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీ, ఎంపిటిసి, జడ్పిటిసి, ఎన్నికలు జరగనున్నాయని కష్టపడి పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కేసులు పెడుతున్నారని, ప్రజా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు నియోజకవర్గ మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తకు ఎల్లవేళలా అండగా ఉంటానని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. మార్చి 10వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో వివిధ కమిటీలు వేయాలని అన్నారు. ఎమ్మెల్యేగా తనకు అండగా నిలబడి గెలిపించిన వారందరినీ గెలిపించుకునే బాధ్యత తనదేనని అన్నారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞత తెలిపేందుకు ఏప్రిల్ నెలలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తానని అన్నారు. వేరువేరుగా జరిగిన ఈ సమావేశాల్లో మాజీ ఎంపీపీ పావనివెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ రామస్వామి, సీనియర్ నాయకులు చుక్కా రంజిత్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కొమురెల్లి, ఇల్లంతకుంట మండలంలోని ఇల్లంతకుంట, శ్రీరాములపల్లి, కనగర్తి, లక్ష్మాజిపల్లి, మల్యాల, వాగోడ్డురామనపల్లి, సిరిసేడు, పాతర్లపల్లి, భోగంపాడు, మర్రివానిపల్లి, గడ్డివానిపల్లి, టేకుర్తి , చిన్న కోమటిపల్లి, రాచపల్లి, మల్లన్న పల్లి, వంతడుపుల బూజునూర్, సీతంపేట గ్రామాలకు సంబంధించిన మాజీ గ్రామ సర్పంచులు నాయకులతోపాటు కార్యకర్తల పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




