
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్ మరియు వంకాయగూడెం గ్రామాల మధ్య జాతీయ రహదారి 563పై గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండకు వెళ్తున్న గుడిపాటి భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందుగా ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనతో ఆటో అదుపుతప్పి ఒక ద్విచక్ర వాహనాన్ని గుద్దింది. అంతేకాదు, ఇన్నోవా కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ, మరో టాటా ఏస్ ప్యాసింజర్ వాహనాన్ని ఢీకొట్టి రోడ్డుకు అవతల బోల్తాపడింది. కారులో ఉన్న ఆరుగురు సురక్షితంగా బయటపడగా, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న బ్లూ కోల్ట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
