
–బీఆర్ఎస్ అవుట్‌డేటెడ్ పార్టీ… కాంగ్రెస్ కౌంట్‌డౌన్ ప్రారంభం!
–బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
––విజయానికి అహర్నిశలు కృషి చేసిన పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు.
—శనివారం కరీంనగర్లో జరగనున్న విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించండి.
–బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల & టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిందని, ఈ గెలుపు చారిత్రకమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన టీచర్లు, పట్టభద్రులు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను స్పష్టంగా వెల్లడించాయని, ఉద్యోగులు, పట్టభద్రులు కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నందునే ఈ తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. బీజేపీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్-కాంగ్రెస్ కలిసినా, డబ్బు పంపిణీ చేసినా ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని అన్నారు.
తెలంగాణలో బీజేపీ శకం ప్రారంభమైంది!
బీఆర్ఎస్ గతాన్ని మూలుగుతూ ఉన్న అవుట్‌డేటెడ్ పార్టీగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్ మొదలైందని, తెలంగాణలో బీజేపీ శకం ప్రారంభమైందని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు.
విజయోత్సవ ర్యాలీ – ముఖ్య అతిథులు
శనివారం మధ్యాహ్నం 3:00 గంటలకు కరీంనగర్ వైశ్య భవన్ నుంచి తెలంగాణ చౌక్ వరకు బీజేపీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బోడిగె శోభ, మాజీ మేయర్లు సునీల్ రావు, డి. శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకటరెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, రంగు భాస్కరాచారి, సాయిని మల్లేశం, కళ్లెం వాసుదేవరెడ్డి, కోశాధికారి వైద రామానుజం, స్టేట్ కౌన్సిల్ మెంబర్ దండు కొమురయ్య, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, అలివేలు సమ్మిరెడ్డి, బండ రమణారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్, మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, నాయకురాలు శిల్ప వేదం, ఎస్సీ, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సోమిడి వేణు ప్రసాద్, కట్ట రాజు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ శ్రేణులకు పిలుపు:
విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయడంలో అందరూ పాల్గొని భవిష్యత్ తెలంగాణలో బీజేపీని మరింత బలపడేలా చేయాలని గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.



