
Oplus_131072
–కోట్లాది రూపాయల ధన
ప్రవాహంతోనే బిజెపి గెలుపు..
–కాంగ్రెస్ అభ్యర్థికి అండగా నిలిచిన నిరుద్యోగులు, పట్టభద్రులు, ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు..
–కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం చేసుకున్నాయని, కేసులకు భయపడే కెసిఆర్ బిజెపికి మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. ఎన్నికల్లో బిజెపి కోట్లాది రూపాయలను వెదజల్లి ధన ప్రవాహంతోనే గెలిచిందని విమర్శించారు. గురువారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి భయపడే బిజెపితో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకొని, లోపల నుంచి మద్దతు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలువద్దనే దురుద్దేశంతోనే బీఆర్ఎస్ బిజెపి ఒకటయ్యాయని పేర్కొన్నారు. కేసుల నుంచి బయటపడందుకే కేసీఆర్ కొత్త నాటకం ఆడారని, చేసిన పాపం ఊరికే పోదని చెప్పారు. నరేంద్రమోడీ ఎక్కడ తమ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తాడని భయంతోనే కెసిఆర్ బిజెపికి సపోర్ట్ ఇచ్చారని మండిపడ్డారు. బిజెపి నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా వెదజల్లారని ఆరోపించారు. ఆ పార్టీ రోజు రోజుకు ఆదరణ కోల్పోతున్నదని, ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిరుద్యోగులకు పదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు వారికి ఏం న్యాయం చేశారు బిజెపి నేతలు ఆత్మవంచన చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి పిట్టకథలు చెప్పుకుంటూ కాలం వెళ్ళదిస్తున్నారు తప్ప గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించలేక పోయారని మండిపడ్డారు. దమ్ముంటే బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్ల కాలంలో నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందో వెల్లడించాలని సవాల్ విసిరారు.
తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే 55, వేల ఉద్యోగాలను కల్పించి నిరుద్యోగుల కు అండగా ఉంటున్నదని, నిరుద్యోగుల పక్షపాతిగా తమ ప్రభుత్వం వ్యవహరి స్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి అండగా నిలిచిన నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నరేందర్ రెడ్డి గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎంతో కష్టపడి పని చేశారని పేర్కొన్నారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు నిరంతరం అండగా ఉంటుందని రాజేందర్ రావు పేర్కొన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రులు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెలిచాల రాజేందర్ రావు తెలిపారు.
