
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై శనివారం హుజురాబాద్ లో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడటమే జగదీశ్వర్ రెడ్డి చేసిన తప్ప అంటూ ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు సరిగా లేవని, ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలదీస్తే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసిందని అన్నారు. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే ప్రభుత్వం పని చేస్తుందని, పేద ప్రజల బాగోగులు అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు మాత్రం అమలు కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ ప్రజలు అసహనంగా ఉన్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఇక రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. ప్రజల తరఫున మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మండలాధ్యక్షుడు ఐలయ్య, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, ఉమామహేశ్వర్, కేసిరెడ్డి లావణ్య, ముక్క రమేష్, కుమార్, ఇమ్రాన్, ధనవర్ష రాజు లతో పాటు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


