
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ మార్చి23: తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా ఉందని, మళ్లీ గెలవడం చారిత్రక అవసరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పేం లేదని, కేసీఆర్పై ద్వేషాన్ని నింపి జనాల మనసు మార్చారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కరీంనగర్ గడ్డలో తిరిగి ఉద్యమ జోరు తీసుకురావాలని, ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభను భారీ విజయంగా మార్చాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మాట్లాడుతున్నవారి నోళ్లు మూతపడేలా సభను విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం: బీఆర్ఎస్ పార్టీ ఉనికే తెలంగాణ కోసం. ఉద్యమానికి వెనుకడుగు వేయమని వారిస్తే రాళ్లతో కొట్టాలని కేసీఆర్ చెప్పిన నాయకుడు. ప్రస్తుత ప్రభుత్వం: రైతుల కష్టాలు, నిరుద్యోగుల ఆవేదన పెరిగిపోతోంది. కేసీఆర్ హయాంలో బాగా ఉన్న రైతులు ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ మోసాలు: బీజేపీ, కాంగ్రెస్ రెండూ తెలంగాణ ప్రయోజనాలకు శత్రువులే. 15 లక్షలు ఖాతాల్లో వేస్తామని మోసగించిన బీజేపీ, తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ను ప్రజలు గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం పరిస్థితి: ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. ఉద్యోగుల జీతాలు పెంచిన నాయకుడు కేసీఆర్. ఇప్పుడు ఉద్యోగులు కూడా తాము మోసపోయామని చెబుతున్నారు. రాబోయే ఎన్నికలు: బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలని, పార్టీని నమ్మిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27 వరంగల్ సభ తర్వాత బీఆర్ఎస్ కొత్త కార్యాచరణ ప్రకటించనుందని, పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టి బలమైన నాయకత్వాన్ని నిలబెట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ జెడ్పి చైర్మన్లు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




సమావేశంలో మాట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..



కత్తి ఎత్తి అభివాదం చేస్తున్న కేటీఆర్..