
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ‘వనజీవి’గా ప్రసిద్ధి చెందిన సామాజికవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ప్రకృతి, పర్యావరణం లేనిదే మానవ మనుగడ అసాధ్యమని విశ్వసించి, ఈ సిద్ధాంతానికి తమ జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు రామయ్యని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
సామాన్య వ్యక్తిగా మొక్కలు నాటడం ద్వారా సమాజాన్ని స్ఫూర్తివంతం చేసిన రామయ్య మరణం సమాజానికి తీరని లోటని, వారు చూపిన మార్గం అందరికీ ఆదర్శమని సీఎం పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన వనజీవి రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మొక్కలు నాటే ఉద్యమంలో రామయ్య గారి వెన్నంటి నడిచిన వారి సతీమణి జానమ్మకి, కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
🔹 వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటు
🔹 తెలంగాణ, ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయింది
- మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు.
“వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని అన్నారు.
మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా వారు చేసిన త్యాగం అసమాన్యమైనదని అన్నారు.
అడవులు, పచ్చదనం అభివృద్ధి దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన తెలంగాణకు హరితహారం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దర్పల్లి రామయ్య అందించిన సహకారం గొప్పదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వనజీవి మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేసారు.
శోకంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు పర్యావరణ పరిరక్షకులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

భార్యతో కలిసి వనజీవి రామయ్య..

వనజీవి రామయ్య(ఫైల్)