
– కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పోప్
– నిన్న ఈస్టర్ వేడుకలలో పాల్గొన్న ఫ్రాన్సిస్
– 14 రోజుల సంతాప దినాలు ప్రకటించిన వాటికన్
వాటికన్ సిటీ, స్వర్ణోదయం ప్రతినిధి : పోప్ ఫ్రాన్సిస్ (88) వాటికన్ సిటీలో నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాటికన్ సిటీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చివరిసారిగా ఆయన నిన్న జరిగిన ఈస్టర్ వేడుకలలో పాల్గొని భక్తులకు సందేశమిచ్చారు. కాగా, 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన ఆయన 2013 మార్చి 13న 266వ పోప్ గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్ గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రిలో చేరి, ఆ తర్వాత కోలుకున్నారు. పోప్ మృతితో యావత్ క్రైస్తవ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది. వాటికన్ సిటీ 14 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఇక ఆమెరికా అధ్యక్షుడితో సహా పలు దేశాల అధినేతలు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం..
ప్రపంచ క్రైస్తవులకు మార్గదర్శి, రోమన్ కాథలిక్ చర్చి పరమ గురువైన పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్రైస్తవ సమాజానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోప్ అనుయాయులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రేమ, కరుణ మార్గాలను బోధిస్తూ, పేదల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, శాంతి స్థాపన, అంతర్ధార్మిక సామరస్యం కోసం పోప్ ఫ్రాన్సిస్ చేసిన కృషి అసాధారణమని, స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు.
అర్జెంటీనాలో సామాన్య కుటుంబంలో జన్మించి, పోప్ స్థాయికి ఎదిగిన ఆయన, తన నిరాడంబర జీవనశైలితో, ప్రజలకు చేరువై, వాటికన్ సిటీని, పోప్ స్థానాన్ని సామాన్యులకు మరింత సన్నిహితం చేసిన మహోన్నత గురువర్యులుగా చరిత్రలో నిలిచిపోతారని ముఖ్యమంత్రి అన్నారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన పోప్ ఫ్రాన్సిస్ బోధనలు మరియు సేవలు రాబోయే తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో క్రైస్తవ సమాజానికి అండగా నిలుస్తున్నామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాంతి, ఆయన భక్తులకు మనోధైర్యం కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.


కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్ (ఫైల్ ఫోటో)