
– పహల్గం మృతులకు సంతాపం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ, కాకతీయ యూనివర్సిటీ : సమాజంలో చోటు చేసుకున్న పరిణామాలు, సంఘటనలను, రాజకీయ ముఖ చిత్రాన్ని, ప్రజల మనోగతాన్ని మీడియా ప్రతిబింబించాలి కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం సంచాలకులు ప్రొఫెసర్ బి సురేష్ లాల్ అన్నారు. ఆదివారం కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం 2022-2024 జర్నలిజం ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం దూరవిద్య కేంద్రం సమావేశం మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జర్నలిజం విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ సంగని మల్లేశ్వర్ అధ్యక్షత వహించారు. ముందుగా పహల్గంలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం డైరెక్టర్ సురేష్ లాల్ మాట్లాడారు. పేదరికం నిరక్షరాస్యత ఆకలి లాంటి రుగ్మతలు లేని సమాజం ఉండాలని జర్నలిస్టులు తపన పడాలని ఆయన ఆకాంక్షించారు. జర్నలిస్టులు మంచి సమాజం కోసం నిరంతరం నిఘా వేసుకొని ఉండాలన్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సామాజిక మధ్యమాల విస్తృతి మూలంగా ప్రపంచంలో ఏ సంఘటన జరిగిన కణాల్లో శరవేగంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. జర్నలిస్టులకు సృజనాత్మకత ఉండాలని ఆచార్య బి సురేష్ లాల్ సూచించారు. జర్నలిజంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకోవడానికి జర్నలిజం విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు కాలంతో పోటీ పడి పనిచేసే తత్వం ఉండాలన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చిన మార్పు మూలంగా గుర్తించిన మేద (ఏఐ) మిషన్ లర్నింగ్ (ఎంఎల్) మీడియా స్వరూపాన్ని మార్చేశాయన్నారు. గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రజా సంబంధాల అధికారి, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…జర్నలిస్టులు సమాజం పట్ల కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జర్నలిస్టులు సత్ప్రవర్తనతో మెలగాలని చెప్పారు. జర్నలిజం కోర్స్ చదివితే సమాజాన్ని చదివినట్టుగా ఉంటుందన్నారు. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల మట్టి వాసన తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంతానికి వచ్చానన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం కు చెందిన డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ…వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి దేశ, రాష్ట్ర నలుమూలల్లో ప్రముఖ జర్నలిస్టులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారన్నారు. వరంగల్ లోని జనధర్మ, వరంగల్ వాణి దినపత్రికలను తాను లెటర్ ప్రెస్ లో చూసానని, ప్రస్తుతం డిజిటల్ మీడియాను చూస్తున్నానని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జర్నలిజం విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ…జర్నలిజం చదివిన విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే విధంగా నడుచుకోవాలన్నారు. వారు వారి ప్రతిభను చూపిస్తా సమాజానికి ఉపయోగపడే వార్తలను రాయాలన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీయాలని సూచించారు. జర్నలిజం కోర్స్ చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు కొదవ లేదన్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ఆటపాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జర్నలిజం విభాగం అధ్యాపకులు కంజర్ల నరసింహారాములు, పెరుమళ్ళ వెంకటేశ్వర్లు, ఈర్ల సురేందర్, డాక్టర్ మోటే చిరంజీవి, డాక్టర్ శంకర్, సిబ్బంది ప్రనుప్,విద్యార్థులు ఈర్ల కుమార్, కుడుతాడి బాపురావు, దుబాసి రవీందర్, బి కమలాకర్, పున్నంచందర్, సునీత, మహోన్నత, లోకేష్, కృష్ణ, అభిషేక్ రెడ్డి, కుమారస్వామి, వంశీ తదితరులు పాల్గొన్నారు.









