
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ మే 02: దేశంలో మోదీ, అమిత్ షా నేతృత్వంలో రాక్షస పాలన సాగుతోందని, “ఆపరేషన్ కగార్” పేరుతో ఇప్పటివరకు 350 మందికి పైగా మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్ తీవ్రంగా విమర్శించారు. హుజురాబాద్ పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఆపరేషన్లో ఎందరో నిర్భాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. గిరిజనులు, చెంచులు, గోండులు, దళితుల వంటి వెనుకబడిన వర్గాలకు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని, కానీ కార్పొరేట్ కంపెనీలకు అడవి ఆస్తులు దక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఎన్కౌంటర్లు ఆపి చర్చలు జరపాలి – కే కేశవరావు లేఖకు మద్దతు
ఎన్కౌంటర్లను నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే కేశవరావు కేంద్రానికి రాసిన లేఖను ఆమోదించాలని సంపత్ డిమాండ్ చేశారు. మావోయిస్టులపై ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేసి, ఉప చట్టాల కింద కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. “RSS వంటి సంస్థలు గతంలో నాలుగుసార్లు నిషేధించబడ్డా, ఎవరినీ ఎన్కౌంటర్ చేయలేదు. మావోయిస్టులను నిర్మూలించాలంటే చర్చల దారినే అవలంబించాలి,” అని అన్నారు. మావోయిస్టులు ఇటీవల కాల్పుల విరమణకు సిద్ధమయ్యారని లేఖల ద్వారా వెల్లడించినా, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. రాహుల్ గాంధీ కూడా ఎన్నోసార్లు ఎన్కౌంటర్ల విధానాన్ని వ్యతిరేకించారని, మావోయిస్టుల సమస్యను శాంతియుత చర్చల ద్వారానే పరిష్కరించాలన్న అభిప్రాయాన్ని తెలిపారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసిందని చెప్పారు. మోడీ, అమిత్ షా రాజ్యాంగ విలువలకు కట్టుబడి మావోయిస్టులతో చర్చలు జరిపి కాల్పుల విరమణ ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ జీడి రవితేజ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, మండల ఉపాధ్యక్షులు సంపంగి అరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తిప్పారపు సంపత్