
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: సాక్షి తెలుగు దినపత్రిక ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా దాడులు జరిపి, శోధనలు నిర్వహించిన చర్యలను పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధంగా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఏపీ ప్రభుత్వ తీరుపై నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సాక్షి పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ఏపీ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కలిసి వినతిపత్రం అందజేశారు.
పత్రికా స్వేచ్ఛను హరించేలా ఏపీ పోలీసులు వ్యవహరించారని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించిన వారు, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని హితవు పలికారు. ఈ నిరసన కార్యక్రమంలో సాక్షి బ్యూరో ఇంచార్జి గడ్డం రాజిరెడ్డి, ఎడిషన్ బాధ్యులు లింగయ్య, పాత్రికేయులు, యూనియన్ ప్రతినిధులు తోట సుధాకర్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, టీయూడబ్ల్యూజేఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెళ్లి మధు, రాష్ట్ర నాయకులు వల్లాల వెంకటరమణ, వేణుమాధవ్, 143 ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మస్కపురి సుధాకర్, రాజ్ కుమార్, స్టాఫర్ వాంకే శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు పిన్నా శివకుమార్, అల్లం రాజేష్ వర్మ, సదానందం, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో జర్నలిస్టు సంఘాల నుంచి తిరుపతి, గొట్టే వెంకట్, సంపేట వెంకటేశ్వర్లు, వరప్రసాద్,డెస్క్ జర్నలిస్టులు మహేష్, ఓంకార్, ఐజేయు-టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు ఊటుకూరు సాయిరాం, సీనియర్ జర్నలిస్టులు అల్వాల సదాశివుడు, కోలా కృష్ణకుమార్ రెడ్డి, అహమ్మద్, బత్తిని రాజేందర్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన వివిధ మండలాల రిపోర్టర్లు పెద్ద సంఖ్యలో హాజరై, తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.




ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్కు వినతిపత్రం ఇస్తున్న పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు నాయకులు.





