
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, వరంగల్ ది హాన్స్ ఇండియా బ్యూరో చీఫ్ ఆడెపు మహేందర్(60) గుండెపోటుతో గురువారం రాత్రి ఆకస్మికంగా హనుమకొండలో మృతి చెందారు. మహేందర్ హన్స్ ఇండియా ఉత్తర తెలంగాణ ప్రతినిధిగా పనిచేస్తూ హుజురాబాద్ కేంద్రంగా పి.వి.జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కు మద్దతుగా అనేక వార్తలు రాసాడు. జిల్లా ఏర్పాటు విషయంలో ప్రజల అభిప్రాయానికి హాన్స్ ఇండియా పత్రికలో అధిక ప్రాధాన్యతను ఇచ్చేవాడు. హుజురాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారులు దివంగత ఆడెపు ప్రకాష్, ఆడెపు సూర్యం, ఆడెపు మహేందర్ ముగ్గురు వరసగా స్వయాన అన్నదమ్ములు. మహేందర్ జర్నలిస్ట్ గా అనేక ప్రజా సమస్యలను ప్రతిబింబిచేలా వార్తలు రాసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో సఫలమయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు. హాన్స్ ఇండియా వరంగల్ జిల్లా ప్రతినిధిగా ఆడెపు మహేందర్ ఈ రోజు కూడా ఆ పత్రికలో రాసిన ఒక వార్తా పలువురి మనసు కలిచివేసింది. “ఈ రోజు మహేందర్ రాసిన వార్త హాన్స్ ఇండియా దిన పత్రికలో రావడం, ఇదే రోజు ఆయన మరణమే వార్త కావడం అత్యంత బాధాకరం”. మహేందర్ గత కొన్ని రోజులుగా డయాలసిస్ తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. మహేందర్ మరణం పట్ల హుజురాబాద్ ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఆవునూరి సమ్మయ్య తన సంతాపాన్నీ వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలపడం జరిగింది. అంతేకాక హుజురాబాద్, కరీంనగర్ పట్టణాలకు చెందిన పలువురు జర్నలిస్టులు, స్వర్ణోదయం పత్రిక ఎడిటర్ మండల యాదగిరి మహేందర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సీనియర్ జర్నలిస్టు ఆడెపు మహేందర్(ఫైల్)