
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను కోరారు. ఇటీవల కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కు బీజేపీ శ్రేణులతో కలిసి వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. కేంద్ర నిధులతో హుజూరాబాద్‌లో మినీ స్టేడియం నిర్మాణం కోసం కమిషనర్‌తో గంగాడి కృష్ణారెడ్డి చర్చించి అవసరమైన ప్రతిపాదనలు, పరిపాలన అనుమతులపై స్పష్టత కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య స్టేడియం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు జిల్లా అధికారులకు, ప్రభుత్వానికి పంపినట్లు ఆయనకు తెలిపారు. ఈ ప్రాంతంలోని పలువురు ప్రతిభావంతులైన క్రీడాకారులకు సరైన మైదానం లేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. బండి సంజయ్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు స్టేడియం ఏర్పాటు హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. హుజూరాబాద్‌లో మినీ స్టేడియానికి అనువైన భూములు ఉన్నాయని, కేంద్ర నిధులతో త్వరితగతిన అభివృద్ధి చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, నేతలు నల్ల సుమన్, కొలిపాక శ్రీనివాస్, యాంసాని శశిధర్, యాళ్ళ సంజీవరెడ్డి, అంకతి వాసు, బోరగాల సారయ్య, కొలిపాక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో మినీ స్టేడియంపై చర్చిస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..
