
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన కోయల్ కార్ స్వప్న పెద్దపెల్లి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునీ అవార్డు అందుకున్నారు. ఆమె హుజురాబాద్ ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ టీచర్ కావాలనే తన కోరికను నెరవేర్చుకుంది. సెకండరీ గ్రేడ్ టీచర్ గా 2008 ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేశవపట్నం, ముస్తాబాద్ మండలాలలో టీచర్ గా పనిచేసి, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యా బోధనలో తనకంటూ ప్రత్యేకతను ప్రదర్శిస్తూ విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దడంతో ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం 2025 ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి డిఇఓ మాధవి, జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులు, తోటి ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. కాగా ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు రావడం పట్ల హుజురాబాద్ ప్రాంతానికి చెందిన ఆమె మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.







