
–సీసీ రోడ్డు పైనే బహిరంగంగా మద్యం సేవిస్తున్న మందు బాబులు
– పర్మిట్ రూమ్ పేరుతో బహిరంగ మద్యం సేవలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ సెప్టెంబర్ 13: హుజురాబాద్ పట్టణం నడి బొడ్డున పాపారావు బొంద పక్కన ఉన్న రెండు మద్యం దుకాణాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రజలు రెండు మద్యం దుకాణాలతో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. రోడ్ల పై నే మద్యం సేవించడం, రోడ్డుపై, దుకాణాల షెట్టర్ల ముందు మూత్ర విసర్జన చేయడం పరిపాటిగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా బహిరంగంగా మద్యం ప్రియులు నడిరోడ్డుపై, నివాసిత ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్నప్పటికీ.. ఎక్సైజ్, పోలీస్, మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాపారావు బొంద పక్కనే ఈ రెండు మద్యం దుకాణాలున్నాయి. రోడ్డు పై మధ్యాహ్నం కూడా మహిళలు, పిల్లలు నడిచి వెళ్లని దుస్థితి నెలకొంది. సాయంత్రం 6 నుండి రాత్రి 10 వరకు మాత్రం ప్రజలు, మహిళలు, పిల్లలు, వ్యాపారులు ప్రత్యక్షంగా నరకం చూస్తున్నారు. పేరుకే పర్మిట్ రూమ్ కానీ రోడ్డుపైనే బహిరంగంగా మద్యం సేవించడం, గతంలో ఎన్నోసార్లు సంబంధిత శాఖల అధికారులకు 26 వార్డు మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య ఆధ్వర్యంలో ప్రజలు వినతి పత్రం ఇచ్చారు. కానీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఐతే.. పర్మిట్ రూముల నిర్వహణ దరిద్రంగా ఉంది. ఆ రూములు చెత్త కుప్పలుగా ఉన్నాయి. పందులు, కుక్కలు కూడా ఉందని దుస్థితి కనిపిస్తోంది. రోడ్డుపై ఉన్న డబ్బాల్లో బెల్ట్ షాప్ మాదిరిగా విరివిగా మద్యం విక్రయాలు చేస్తున్నారు. షాపులకు అనుకుని నివాసిత ప్రాంతం ఉంది. సాయంత్రం అయితే షెట్టర్లు, ఇళ్ల తలుపులు వేసుకుని బిక్కు బిక్కు మంటూ జీవనం గడిపే పరిస్థితి దాపురించింది. మద్యం తాగిన తర్వాత నివాసాల్లో షాపు ల ముందు తాగి వంతులు చేసుకోవడం, రాత్రిళ్ళు షాపుల ముందు పడుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి, షాపు ల ముందు ప్లాస్టిక్ గ్లాసులు పడేయడం ,సీసాలు వేయడం ద్వారా ఆ సమీపంలో ఉన్న యజమానులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. పట్టణంలో నడి కూడలిలో సుందరంగా ఉండాల్సిన రోడ్డుపై సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులతో ఓ చెత్త కుప్పగా ఆ ప్రాంతమంతా ప్రతినిత్యం కనిపిస్తోంది. దళిత బంధు లో ఓ ఎరువుల షాపు తో పాటు మరో ఎరువుల షాపు, కిరాణా దుకాణాలు ఇబ్బందులు పడుతున్నారు . రోడ్ల పై నే మద్యం మత్తులో రోడ్డు పైనే మూత్ర విసర్జన చేయడం వల్ల నడి ఒడ్డున ముక్కు మూసుకునే దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అంబేద్కర్ కూడలికి సమీపాన పాపారావు బొంద పక్కనున్న బ్రాందీ షాపులను పట్టణ ఇండ్ల కూడలి నుండి తొలగించి, చుట్టు ప్రక్కన ఉన్న కుటుంబాలకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఆ మద్యం దుకాణాలకు టెండర్లు వేయొద్దు
త్వరలోనే మద్యం షాపుల పరిమితి ముగిసి కొత్తషాపులు వస్తునందున హుజురాబాద్ పట్టణంలో.. జనావాసంలో.. పాపారావు బొంద పక్కన ఉన్న మద్యం దుకాణాలకు ఈ సారి టెండర్లు వేయొద్దని ప్రజలు, పరిసరాల వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా ప్రస్తుతం ఉన్న మద్యం షాపులకు అనుమతులు ఇవ్వొద్దని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశామని, ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్, ఎక్సైజ్, పోలీస్ శాఖకు ప్రజలతో కలసి సంబంధిత అధికారులకు ఇస్తామని తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య తెలిపారు.

పేరుకే పర్మిట్ రూమ్ కానీ రోడ్లపైనే… తాగుతూ తూలుతున్నారు..



పర్మిట్ రూమ్ లోపల అపరిశుభ్రతతో దుర్గంధం వేదజల్లుతున్న దృశ్యాలు..





