
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఓసి కులాల్లోని ఆర్ధికంగా వెనుకబడిన పేదలకు కేంద్రం కల్పించిన ఈడబ్లూఎస్ రిజర్వేషన్ల పకడ్బందీ అమలుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
ఓసిల సమస్యలు, జాతీయ కమిషన్ ఏర్పాటుపై చర్చించదానికీ ఓసి జెఎసి ఆధ్వర్యంలో ఈ నెల 19న వరంగల్ లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. వరంగల్ సదస్సుకు, రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి సామాజిక వర్గీయులు భారీ ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం హైదర్ గూడ లోని సమాఖ్య కార్యాలయంలో రాష్ట్ర కమిటీ నాయకుల సన్నాహక సమావేశంలో రామారావు మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు పేద ఓసిలకు వర్తింప జేయాలన్నారు. స్ధానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ కేటగిరిలో కేటాయించిన స్థానాల్లో ఓసిలతో పాటు ఓసీయేతరులు పోటీ పడుతుండటం తో ఓసివర్గీయులకు అవకాశాలు దక్కక తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. ఓసిలకు కనీసం 6శాతంతో ప్రత్యేక స్థానాలు రిజర్వు చేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఆ సమాఖ్య రాష్ట్ర నాయకులు చిటుకుల నరసింహారెడ్డి, జనగామ కరుణాకర్ రావు, రామకృష్ణ ప్రసాద్, దుబ్బా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


విలేకరులతో మాట్లాడుతున్న ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.





