
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడి కేంద్రాల్లో విద్యార్థులకు భోజనం అందించే వంట గదుల పరిశుభ్రత పట్ల బాధ్యులు శ్రద్ధ వహించాలని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య సూచించారు. బుధవారం హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని హుజురాబాద్, బోర్నపల్లిలలోని ప్రభుత్వ పాఠశాలల అంగన్వాడీ కేంద్రాల వంట గదులను ఆయన సందర్శించి పరిశీలించారు. వంట గదుల పరిశుభ్రత పట్ల పాఠశాల వంట చేసేవారు తగిన శ్రద్ధ వహించాలని, ప్రధానోపాధ్యాయులు సైతం పరిశీలించాలని కోరారు. పరిశుభ్రత లేకపోవడం వల్ల జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల సూచనలు మేరకు హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల, అంగన్వాడీ కేంద్రాల వంటగదులను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించడం వల్ల వారు ఎలాంటి అనారోగ్యానికి లోను కారని అన్నారు. వంట గదుల పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించకపోతే పిల్లలకు ఇబ్బంది అవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తాముండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం విధిగా భావించాలన్నారు. బోర్ణపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల వంటగదినీ ఆయన పరిశీలించినప్పుడు అపరిశుభ్రంగా ఉండడంతో అప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బందిని పిలిపించి గదిని పరిశుభ్రం చేయించారు. పరిశుభ్రమైన వాతావరణం ఉండటం వల్ల మంచి ఆహారం పిల్లలకు భుజించే వీలు కలుగుతుందన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని పాఠశాలల వంట గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవసరమైన వారు మున్సిపల్ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ బి కిరణ్, సిబ్బంది ప్రతాప రాజు, తదితరులు పాల్గొన్నారు.




హుజురాబాద్, బోర్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో వంటశాల గదుల పరిశుభ్రతలను పరిశీలించిన హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య.. పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించాలని సూచన





