
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ నవంబర్ 18: కాంగ్రెస్ ప్రభుత్వానికి కోపం ఉంటే నా మీదే చూపించండి, నా ఆడబిడ్డల మీద కాదు అంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హుజురాబాద్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గం లోని ఆడబిడ్డలకు చెక్కుల పంపిణీ చేయడానికి కూడా ప్రభుత్వం అడ్డు తగులుతుందని, మంత్రికి చెప్పి చెక్కుల పంపిణీ చేయాలని చెప్పారని, దానిని తీవ్రంగా వ్యతిరేకించి గతంలోనే కోర్టు నుంచి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నానని గుర్తు చేశారు. చెక్కులను ఆలస్యం చేసేందుకు చూశారని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి అధికారులను రానివ్వకుండా అజమాయిషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీస్తే తనపై కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టిన చివరికి జైల్లో వేసిన ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాటం చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి ఆడబిడ్డలను మోసం చేస్తున్నారని అన్నారు. కెసిఆర్ ఎన్నికల సమయంలోనే మోసపోతే గోసా పడతారు అని చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఆరు గ్యారంటీలు పక్కన పెడితే కెసిఆర్ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. అసలు కెసిఆర్ అమలు చేసిన చాలా పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలుపుదల చేసిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకాలు ఆడుతారని అన్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రైతు భరోసా డబ్బులు వేసి ఎన్నికలకు వెళ్తారని, ఏవైనా ఎన్నికలు వస్తేనే ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ప్రభుత్వానికి గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టేలా తీర్పు నివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు.



లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..





